Begin typing your search above and press return to search.

మోత మోగనున్న ఊబర్.. ఓలా.. ర్యాపిడో ఛార్జీలు

ఇదిలా ఉంటే.. ఈ సేవలకు సంబంధించి తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   3 July 2025 11:00 AM IST
మోత మోగనున్న ఊబర్.. ఓలా.. ర్యాపిడో ఛార్జీలు
X

పట్టణాల్ని పక్కన పెడితే.. నగరాల్లో రవాణా సౌకర్యంగా ఓలా.. ఊబర్.. ర్యాపిడో సేవల్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల బెంగళూరు మహానగరంలో బైక్ సేవల్ని అందించే వారిపై పరిమితులు విధించటంతో బెంగళూరు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. ప్రజా రవాణా అంతంతమాత్రంగా.. పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఓలా.. ఊబర్.. ర్యాపిడో లాంటి క్యాబ్ సర్వీసుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సేవలకు సంబంధించి తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ వేళల్లో ఛార్జీలు డబుల్ వసూలు చేసుకోవటానికి వీలుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మరో నిర్ణయాన్ని తీసుకుంది. రద్దీ లేని సాధారణ వేళల్లో కనీస మొత్తం 50 శాతం కంటే తక్కువ ఛార్జి తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు.. రవాణ.. రహదారుల శాఖ స్పష్టమైన మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీల్లో 50 శాతం తక్కువ నుంచి గరిష్ఠంగా రెండింతలు (డబుల్) వరకు వసూలు చేసుకునే వీలుంది. అంటే.. ఏదైనా ఒక నిర్ణీత దూరానికి బేసిక్ ఫెయిర్ రూ.50 అనుకుంటే.. డిమాండ్ లేని వేళల్లో కనీసం రూ.25 కంటే తక్కువ ఛార్జీ వసూలు చేయకూడదు. అదే సమయంలో రద్దీ వేళల్లో గరిష్ఠంగా రూ.100లకు మించి వసూలు చేయకూడదు. ఇప్పటివరకు గరిష్ఠ ఛార్జీ ఒకటిన్నర రెట్లు మాత్రమే ఉండేది. అంటే.. ఇప్పటివరకు రూ.75 మాత్రమే వసూలు చేసే దానికి బదులుగా..ఇక నుంచి రూ.100 వరకు వసూలు చేసే వీలు ఉంటుంది.

క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణాన్ని (రైడ్) ను రద్దు చేసుకుంటే.. రైడ్ ఛార్జీల్లో పది శాతం.. ఆ మొత్తం రూ.100కు మించకుండా ఫైన్ గా వేయొచ్చు. అదే సమయంలో ప్రయాణికులు రద్దు చేసినా.. ఇదే నిబంధనను వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడ్ని పికప్ చేసుకోవటానికి క్యాబ్ ప్రయాణించే దూరం 3 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదని స్పష్టం చేశారు.

మరో కీలకమైన ఆదేశాన్ని కేంద్రం జారీ చేసింది. క్యాబ్ డ్రైవర్ సంబంధిత సంస్థ తమ యాప్ లో పేర్కొన్న దారిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది.అందుకు భిన్నంగా దారి మారిస్తే.. వెంటనే కంట్రోల్ రూంను అప్రమత్తం చేసేలా ఆగ్రిగేటర్లు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీస బీమా రూ.5 లక్షలు తీసుకోవాలి. డ్రైవర్లకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. రూ.10 లక్షలు టెర్మ్ బీమాను తీసుకోవాల్సి ఉంటుంది.

క్యాబ్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసిన నాటి నుంచి ఎనిమిదేళ్లు దాటిన వాహనాల్ని సర్వీసులో ఉంచకూడదు. ప్రతి వాహనంలోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాల్ని తప్పనిసరిడా అమర్చుకోవాల్సి ఉంటుంది. టూవీలర్ల వాహనాల్ని క్యాబ్.. ట్యాక్సీ సేవల కోసం వినియోగించుకోవటానికి వీలుగా కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇందుకు ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలని.. ఆ సేవల్ని అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకునేందుకు వీలుగా సూచనలు చేసింది. మొత్తంగా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఛార్జీల భారం ప్రయాణికుల మీద పడుతుందని మాత్రం చెప్పక తప్పదు. అందులోనూ పీక్ వేళల్లో బుక్ చేస్తే.. ఛార్జీల మోత ఓ రేంజ్ లో ఉండటం ఖాయం. సో. బీరెడీ.