Begin typing your search above and press return to search.

మాజీ సీఎం జగన్ అరెస్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

అయితే లిక్కర్ స్కాంలో అంతిమ లబ్ధిదారుగా భావిస్తున్న మాజీ సీఎం జగన్ అరెస్టుపై అధికార కూటమికి చెందిన కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

By:  Tupaki Desk   |   2 Aug 2025 7:20 PM IST
Pemmasani Chandrasekhar Reacts Jagan Arrest
X

ఏపీ లిక్కర్ స్కాంపై విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. దాదాపు 40 మంది నిందితులను గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు అధికారులు ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో వైసీపీ కీలక నేతలు కూడా ఉన్నారు. అయితే లిక్కర్ స్కాంలో అంతిమ లబ్ధిదారుగా భావిస్తున్న మాజీ సీఎం జగన్ అరెస్టుపై అధికార కూటమికి చెందిన కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో మాజీ సీఎం జగన్ పేరును ప్రస్తావించింది. దీంతో ఆయన అరెస్టుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని మీడియా కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన జగన్ అరెస్టుపై ప్రభుత్వ ఆలోచనను స్పష్టం చేశారు.

రూ.3,500 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని లిక్కర్ స్కాంపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ స్కాంపై మాట్లాడిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ లిక్కర్ స్కాం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని చెప్పారు. ఏ ఆధారాలు లేకుండానే పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయరు కదా? అని ఎదురు ప్రశ్నించిన కేంద్రమంత్రి చంద్రశేఖర్ ఆధారాలు లభించగానే బిగ్ బాస్ ను సైతం అరెస్టు చేస్తారని స్పష్టం చేశారు. దీంతో లిక్కర్ కేసులో బిగ్ బాస్ గా ప్రచారం జరుగుతున్న మాజీ సీఎం జగన్ అరెస్టుకు ఇంకా ఆధారాలు లభించలేదా? అన్న చర్చ మొదలైంది.

ఏపీ లిక్కర్ స్కాంలో ప్రతిపక్ష వైసీపీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా మాజీ సీఎం జగన్ కు కుడి, ఎడమ భుజాలుగా భావిస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టుతో జగన్ కు కష్టాలు చుట్టుముట్టినట్లేనని ప్రచారం జరిగింది. అయితే తొలి చార్జిషీటులో లిక్కర్ స్కాంలో వసూలు చేసిన కమీషన్ డబ్బు మాజీ సీఎం జగన్ కు అందినట్లు సిట్ ప్రస్తావించింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయా? లేవా? అన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఇదే సమయంలో జగన్ పాత్రకు సంబంధించి ఆధారాలు ఉంటే ఆయనను నిందితుడిగా చేర్చేవారని అంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలను పరిశీలిస్తే జగన్ పాత్రపై సిట్ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పిన ప్రకారం జగన్ అరెస్టు ఇప్పట్లో ఉండదనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.