Begin typing your search above and press return to search.

ఊపందుకున్న 'బాయ్‌కాట్ తుర్కియే' నినాదం.. సెలెబి సంస్థపై కేంద్రం వేటు

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు జమ్మూలో మాట్లాడుతూ.. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   15 May 2025 11:12 PM IST
ఊపందుకున్న బాయ్‌కాట్ తుర్కియే నినాదం.. సెలెబి సంస్థపై కేంద్రం వేటు
X

భారత విమానాశ్రాయాల్లో కీలక భద్రతా సేవలను అందజేస్తున్న తుర్కియే సంస్థ సెలెబి ఏవియేషన్‌పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా, సెలెబి సంస్థకు ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తక్షణమే రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఆదేశాలను జారీ చేసింది. పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతుగా నిలవడం, ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు, క్షిపణులు అందించడం వంటి చర్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు జమ్మూలో మాట్లాడుతూ.. జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఇది భద్రతాపరమైన అంశం. సంబంధిత ఏజెన్సీలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు రామ్మోహన్ నాయుడు చేసిన కొన్ని గంటల్లోనే సెలెబి సంస్థపై వేటు పడింది.

సెలెబి ఏవియేషన్.. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 'సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా' పేరుతో ఈ సేవలను అందజేస్తుంది. ఢిల్లీ విమానాశ్రయంలో కార్గో సేవలను 'సెలెబి దిల్లీ కార్గో టెర్మినల్ మేనేజ్‌మెంట్ ఇండియా' నిర్వహిస్తోంది. విమానాల రాకపోకలు, ప్రయాణికుల భద్రత, కార్గో నిర్వహణ వంటి కీలకమైన పనులను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ర్యాంప్ సర్వీసులు, లోడ్ కంట్రోల్, బోర్డింగ్ బ్రిడ్జిల అనుసంధానం, పోస్టల్, గోదాముల నిర్వహణ వంటివి ఈ సంస్థ బాధ్యతలు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతుగా నిలవడం, డ్రోన్లు, క్షిపణులు అందించడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. 'బాయ్‌కాట్ తుర్కియే' నినాదం ఊపందుకుంది. ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియేకు బుకింగ్‌లు నిలిపివేశాయి. పలు విశ్వవిద్యాలయాలు ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తుర్కియే నుంచి దిగుమతి అయ్యే వస్తువులను నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఈ నిర్ణయం భారత్-తుర్కియే సంబంధాలపై ప్రభావం చూపనుంది. భద్రతా పరమైన విషయాల్లో భారత్ ఎంత కఠినంగా ఉంటుందో ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి.