Begin typing your search above and press return to search.

కేంద్రం కీలక నిర్ణయం.. బిహార్ ఎన్నికల తర్వాత జరగబోయేది ఇదేనా?

బిహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత ‘వన్ నేషన్-వనే ఎలక్షన్’పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   7 Nov 2025 8:00 PM IST
కేంద్రం కీలక నిర్ణయం.. బిహార్ ఎన్నికల తర్వాత జరగబోయేది ఇదేనా?
X

బిహార్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం జరుగుతోంది. గురువారం బిహార్ లో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నెల 11న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికలు బిహార్ రాష్ట్రానికే పరిమితమైనప్పటికీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జాతీయ స్థాయిలో కీలక రాజకీయ నిర్ణయాలు ఉండొచ్చని అంటున్నారు. కాగా, బిహార్ లో గురువారం జరిగిన తొలివిడత పోలింగులో 64.66 శాతం ఓటింగు శాతం నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం.

బిహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత ‘వన్ నేషన్-వనే ఎలక్షన్’పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. బిహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్రం ముందుగా చెప్పినట్లు 2027లో జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేయడం ఖాయమంటున్నారు. 2027 ఫిబ్రవరిలో ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవడం ద్వారా జమిలి ఎన్నికలకు తెరతీయాలని కేంద్ర పెద్దలు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

కేంద్రం అనుకున్నట్లు జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 2027లో సుమారు ఆరు నెలల పాటు దేశంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందని అంటున్నారు. బిహార్ రిజల్ట్ వచ్చిన తర్వాత కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో అసెంబ్లీ, లోక్ సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే అంశాన్ని ఈ బిల్లు ద్వారా ఆమోదించాలని కేంద్రం యోచిస్తోందని అంటున్నారు.

ఇక బిహార్ ఫలితంలో ఏం తేడా జరిగినా, జమిలి ఎన్నికల ప్రస్తావనకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటున్నారు. పదకొండేళ్లుగా దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, ఎన్డీఏ కూటమికి ఎదురుగాలి వీస్తే.. జమిలి ఎన్నికలు నిర్వహించే సాహసోపేతమైన నిర్ణయం తీసుకునే విషయంలో వెనక్కి తగ్గక తప్పదని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ప్రజాభిప్రాయం అనుకూలంగా లేదని తేలితే, చేతిలో ఉన్న అధికారం పోగొట్టుకోవాల్సివస్తుందని, తద్వారా చేతులు కాల్చుకునే సాహసం చేయదని అంటున్నారు. ఒకవేళ బిహార్ లో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏకి ప్రజలు జైకొడితే ఊహించని సంచలన నిర్ణయానికి ప్రధాని పూనుకుంటారని విశ్లేషిస్తున్నారు.