Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదాలపై కేంద్రం నివేదిక.. వణికుస్తున్న తాజా వివరాలు!

ఎన్నో బ్రతుకులను మధ్యలోనే తుంచేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన తాజా నివేదిక కేంద్రం విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 12:30 PM GMT
రోడ్డు ప్రమాదాలపై కేంద్రం నివేదిక..  వణికుస్తున్న  తాజా వివరాలు!
X

ఎప్పుడు, ఎలా, ఏ వాహన రూపంలో, ఏ కారణంతో వస్తాయో తెలియనివి రోడ్డు ప్రమాదాలు! అజాగ్రత్తా, అతివేగం, తాగిన మైకం, ఆలోచిస్తూ ఉండేది ఏదో లోకం... కారణం ఏదైనా నిత్యం రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు ప్రధానంగా నిలుస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను ఈ రోడ్డు ప్రమాదాలు ఛిద్రం చేస్తున్నాయి. ఎన్నో బ్రతుకులను మధ్యలోనే తుంచేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన తాజా నివేదిక కేంద్రం విడుదల చేసింది.

అవును... తమనం కరెక్ట్ గా వెళ్లినా.. అవతలి వ్యక్తి కూడా కరెక్ట్ గా రావాలి కదా అని అంటుంటారు. కానీ... అవతలి వ్యక్తికి ఇతడు కూడా అవతలి వ్యక్తే అనే విషయం మరిచిపోతుంటారు! అని రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించే సమయంలో చెబుతుంటారు. ఈ క్రమంలో దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి, రవాణాశాఖ నివేదికను విడుదల చేసింది.

ఇందులో భాగంగా... 2021 సంవత్సరం కంటే 2022 సంవత్సరంలో ప్రమాదాల సంఖ్య పెరిగిందని తెలిపింది. దేశంలో జరుగుతున్న ప్రమాదాలు, మరణాల గురించి కేంద్ర రహదారి రవాణాశాఖ విడుదల చేసిన నివేదికలో 2021తో పోలిస్తే... 2022లో ప్రమాదాలు 11.9%, మరణాలు 9.4%, క్షతగాత్రుల సంఖ్య 15.3% పెరిగిందని పేర్కొంది. ఇదే సమయంలో గంటకు సరాసరిన దేశవ్యాప్తంగా 53 ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. వాటిలో 19 మంది మరణిస్తున్నారని చెప్పింది.

ఇదే క్రమంలో ప్రమాదాలు, మరణాల విషయంలో ముందు వరుసలో ఉన్న 10 రాష్ట్రాల పేర్లను నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా... తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కేరళ, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు ప్రమాదాల పరంగా తొలి పది స్థానాలను కైవసం చేసుకున్నాయని తెలిపింది.

ఇదే సమయంలో... ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు మరణాల పరంగా మొదటి పదిస్థానాల్లో నిలిచాయి. ఈ రెండు విషయాలలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకూ స్థానం దక్కడం గమనార్హం! తాజా వివరాల ప్రకారం... ఏపీలో 2022లో జరిగిన ప్రమాదాల సంఖ్య 8,650 కాగా.. తెలంగాణలో జరిగిన ప్రమదాల సంఖ్య 7,505 గా ఉంది.

ఇదే సమయంలో... 2022లో ఈ ప్రమాధాల వల్ల మరణించిన వారి సంఖ్య ఏపీలో 3,793 గా ఉండగా... తెలంగాణ రాష్ట్రంలో 3,010 గా ఉంది. ఇదే క్రమంలో... దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ పై జరిగిన ప్రమాదాల సంఖ్య 1,51,997 గా ఉండగా... మరణాల సంఖ్య 61,038గా ఉంది!

కాగా... తాజాగా ఈ రోజు ఉదయమే చిత్తూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. గుడిపాల మండలంలోని చిత్తూరు - వేలూరు నేషనల్ హైవేపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.