Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర సెలబ్రిటీ జ్యోతిష్యుడు అరెస్టు

తన మాటలతో సమాజాన్ని మాత్రమే కాదు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నేతలు.. సెలబ్రిటీలను ప్రభావితం చేసే మహారాష్ట్రకు చెందిన పేరు మోసిన సెలబ్రిటీ జ్యోతిష్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   20 March 2026 9:52 AM IST
మహారాష్ట్ర సెలబ్రిటీ జ్యోతిష్యుడు అరెస్టు
X

తన మాటలతో సమాజాన్ని మాత్రమే కాదు.. అత్యున్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నేతలు.. సెలబ్రిటీలను ప్రభావితం చేసే మహారాష్ట్రకు చెందిన పేరు మోసిన సెలబ్రిటీ జ్యోతిష్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆధ్యాత్మికత ముసుగులో 35 ఏళ్ల మహిళపై పదే పదే అత్యాచారానికి పాల్పడిన 67 ఏళ్ల అశోక్ ఖరాత్ అనే జ్యోతిష్యుడ్ని నాసిక్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం పేరుతో పూజలు చేసే క్రమంలో బాధితులకు మత్తు మందులు కలిపి ఇచ్చి.. వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడని.. ఈ సందర్భంగా రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించి.. వారిని బ్లాక్ మొయిల్ చేసేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వాదనకు బలం చేకూరేలా పోలీసుల విచారణలో లభించిన పెన్ డ్రైవ్ లో 58 మంది మహిళలపై చిత్రీకరించిన అసభ్యకర వీడియోలు వెలుగు చూశాయి. రిటైర్డు మర్చంట్ నేవీ అధికారిగా తనను తాను క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఈ ‘కెప్టెన్’ అసలు రంగు బయటకు రావటంతో అందరూ అవాక్కు అవుతున్న పరిస్థితి. మర్చంట్ నేవీ అధికారిగా రిటైర్ అయ్యాక నాసిక్ జిల్లాలోని సిన్నార్ ప్రాంతంలో ఇతను స్థిరపడ్డారు. జ్యోతిష్యం.. వాస్తు శాస్త్రం మీద పట్టు సాధించాడు. తనకున్న వాక్ చాతుర్యంతో జరిగేది ముందే చెప్పగలనంటూ ప్రజల్ని నమ్మించటం మొదలు పెట్టాడు.

2014లో మొదలైన అతని జ్యోతిష్య వ్యాపారం 2014 తర్వాతి నుంచి పీక్స్ కు చేరుకుంది. మహారాష్ట్రలోని పలువురు కీలక రాజకీయ నేతలకు దగ్గరయ్యాడు. ఎన్నికల సమయాల్లో ఏ ముహుర్తంలో నామినేషన్లు దాఖలు చేయాలి? ఎలాంటి రంగుల వస్త్రాలు ధరించాలన్న వివరాల్ని అతనే చెప్పేవాడు. అతడు చెప్పిన అంశాలు రెండు.. మూడు జరగటంతో ఇతడి పేరు మారుమోగింది. ఇదే సమయంలో శ్రీ శివనిక సంస్థాన్ పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించాడు. సామాజిక కార్యక్రమాలు.. జల సంరక్షణ పేరుతో సమాజానికి పనికి వచ్చే పనులు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేశాడు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పలువురు మంత్రులు.. చివరకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సైతం బహిరంగంగా ఇతడికి మద్దతుగా నిలిచేవారు. బహిరంగంగా ఇతడి పాదాలకు నమస్కారం చేయటం ద్వారా సామాన్య ప్రజల్లోనూ ఇతనో దైవాంశ సంభూతుడన్న భ్రమను కలిగించటంలో సక్సెస్ అయ్యాడు. తనకున్న ధన బలం.. అంగబలంతో తన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేవాడు.దీంతో.. అతడి ఇమేజ్ అంతకంతకూ భారీగా విస్తరించిన పరిస్థితి.

ఖరీదైన కార్లు.. గన్ మెన్లతో పాటు.. విమానాశ్రయాలకు వెళితే.. సాధారణంగా రాష్ట్ర మంత్రులకు లభించే ప్రోటోకాల్ ను ఇతడికి అమలు చేయటం చూస్తే.. ఇతని రేంజ్ ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఖరాత్ తన ఆఫీసులోని బెడ్రూంలోనూ.. హాల్ లోనూ రహస్య కెమెరాలను ఎవరికి తెలీకుండా అమర్చాడు. బాధితులకు తెలీకుండా వారి ఏకాంత క్షణాల్ని చిత్రీకరించేవాడు.ఇలా ఒక పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 58 అశ్లీల వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో కొందరు సెలబ్రిటీలు ఉన్నట్లుగా చెబుతున్నా.. దానికి సంబంధించిన వివరాలు మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. దీంతో.. ఇవన్నీ ఉత్త ప్రచారాలుగా కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏమైనా.. ఇతగాడి అరెస్టు మహారాష్ట్ర వ్యాప్తంగా పెను సంచనలంగా మారిందని చెప్పాలి.