ప్రజలే ఎపుడూ గెలుస్తారు చంద్రబాబూ...!
ఇక బాబు లేటెస్ట్ స్లోగన్ ఏంటి అంటే ఈసారి గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు అని. అదే నిజం. అదే ప్రజాస్వామ్యం కూడా. పార్టీలు మిధ్య, రాజకీయం మిధ్య.
By: Tupaki Desk | 14 Dec 2023 8:58 PM ISTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కొత్తగా ఒక మాట చెబుతున్నారు. అది తానే కనుగొన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు చారిత్రాత్మకమైనవి అంటున్నారు. చిత్రమేంటి అంటే బాబు ఇదే మాటను 2004, 2009, 2014, 2019లో కూడా అన్నారు. అఫ్ కోర్స్ ప్రతీ సారి ఎన్నికలు చారిత్రాత్మకమే. అది కూడా ప్రజల కోణంలోనే.
ఇక బాబు లేటెస్ట్ స్లోగన్ ఏంటి అంటే ఈసారి గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు అని. అదే నిజం. అదే ప్రజాస్వామ్యం కూడా. పార్టీలు మిధ్య, రాజకీయం మిధ్య. ప్రజలే ప్రభువులు వారే అంతిమ నిర్ణేతలు. వారే ఎపుడూ గెలుస్తూ ఉంటారు.
మరి ఈ విషయం ఇంత స్పష్టంగా ఉండగా ప్రజలు గెలవాలని చంద్రబాబు మళ్లీ పిలుపు ఇవ్వడంలో అర్ధం ఏంటి. తెలుగుదేశం పార్టీ అంటే గెలిపించరా అన్నది కూడా చర్చకు వస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీలో అయినా కార్యకర్తలు నాయకులు ప్రజలు కారా అన్నది మరో సందేహంగా వస్తోంది.
ప్రజలు గెలవడం అంటే నిన్నటికీ నేటికీ ఒక మేలు ఎక్కువ చేసే పార్టీని ఎన్నుకుని తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని స్థాపించుకోవడమే. అందుకోసమే అయిదేళ్లకు ఒక మారు ఎన్నికలు అన్న ప్రక్రియ ఉంటుంది. ఇక ప్రజలు తమ జీవన ప్రమాణాలు ఎంతవరకూ పెరిగాయి అన్నవి చూస్తారు. అవి భవనాలు అభివృద్ధి రోడ్లు, ఇతర ప్రగతి పధంలోనూ ఉండవచ్చు అలాగే నేరుగా తమకు కలిగించే సంక్షేమ పధకాల ద్వారా ఉండవచ్చు.
పధకాలు ఉచితాలు తప్పు అని ఎవరు అనుకున్నా అది కూడా తప్పు అన్నది ఆర్ధిక వేత్తల భావన. ఎందుకంటే పేదవాడికి ఎంత డబ్బు పంచినా అదంతా తిరిగి ఖజనాకు ఏదో రూపంలో వచ్చి చేరుతుంది. మార్కెట్ ఎకానమీ పెరిగుతుంది. ఇది ఒక థియరీ. మరి ఆ విధంగా చూసినపుడు వైసీపీ నగదు బదిలీ పథకాలు జన జీవితాన్ని మార్చాయని కూడా చెప్పాల్సి ఉంటుంది.
అదే విధంగా అభివృద్ధి అంటున్న చంద్రబాబు కానీ టీడీపీ నేతలు ప్రవచించే సిద్ధాంతాల వల్ల దీర్ఘకాల అభివృద్ధి జరగవచ్చు లేదా అనుకున్న స్థాయిలో జరగకపోవచ్చు. వాటి ఫలితాలు వచ్చేంతవరకూ పెదవాడిని ఆకలితో ఉంచడమూ తప్పే.అందువల్ల పధకాలు వర్సెస్ అభివృద్ధి అనుకున్నా జనాల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
ఇక చంద్రబాబు అన్న మరో మాట ఉంది. అదే రాష్ట్రం గెలవాలి అని.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు అన్నారు. అందువల్ల రాష్ట్రం అంటే అయిదు కోట్ల ప్రజలు. సో ప్రజలు గెలిస్తే రాష్ట్రం గెలిచినట్లే. అలాగే ప్రజలు తాము కోరుకున్న ప్రభుత్వాని తెచ్చుకుంటే వారు గెలిచినట్లే.
ఇలా స్థూలంగా చెప్పేది అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎన్నికలు అంటేనే ప్రజల కోసం ఉన్నవి. ప్రజలు ఎపుడూ విజేతలే. తమకు ఓటేయని ప్రజలు ఓడిపోయారు అని నిందించడం ఆయా నాయకుల పార్టీల కురచ బుద్ధిని తెలియచేస్తుంది తప్ప ప్రజల విజ్ఞతను తగ్గించదు. వారి నిర్ణయాన్ని ఏ మాత్రం ప్రభావితం కూడా చేయదు. సో నాడూ నేడూ ఏనాడూ ప్రజలే గెలుస్తారు. ఆ విషయంలో చంద్రబాబు సహా ఎవరికీ ఎలాంటి కలవరం బెంగా అవసరం అంతకంటే లేదు.
అయితే టీడీపీ ప్రజలు గెలవాలి తెలుగు జాతి గెలవాలి అంటూ ఇస్తున్న నినాదాలు ఎమోషన్స్ గా మారి టీడీపీ వైపుగా విజయం దక్కించుకునేందుకు చంద్రబాబు వేస్తున్న వ్యూహంగా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రజా స్వామ్యంలో ప్రజల తీర్పు ఎవరికైనా శిరోధార్యమే అన్న సంగతి అంతా గమనించి దానికి అనుగుణంగా తమ అడుగులు వేస్తే మంచింది.
