Begin typing your search above and press return to search.

వైసీపీ నేతల కోసం : డోర్స్ ఓపెన్ చేసిన చంద్రబాబు...!

ఈ నేపధ్యంలోనే ప్రత్యర్ధి పార్టీ టీడీపీ వైసీపీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఇదిలా ఉంటే గురువారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద స్పందించారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 7:00 AM IST
వైసీపీ నేతల కోసం :  డోర్స్ ఓపెన్ చేసిన చంద్రబాబు...!
X

వైసీపీలో ఇపుడు టికెట్ల మీద కసరత్తు సాగుతోంది. పనితీరు ఆధారంగా టికెట్లు ఇవ్వాలని అధినేత జగన్ నిర్ణయించారు. టికెట్లు దక్కని వారికి పార్టీ అనేక విధాలుగా నచ్చచెబుతోంది. అయినా సరే టికెట్లు దక్కని వారు వేరే మార్గం చూసుకుంటారు అని కూడా ప్రచారంలో ఉంది.

ఈ నేపధ్యంలోనే ప్రత్యర్ధి పార్టీ టీడీపీ వైసీపీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. ఇదిలా ఉంటే గురువారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద స్పందించారు. 151 మందిని మొత్తం మార్చినా వైసీపీ గెలిచేది ఈసారి ఉండదు అని ఆయన జోస్యం చెప్పారు మార్చి తరువాత ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయని కూడా బాబు అంటున్నారు.

వైసీపీ అభ్యర్ధులకు డిపాజిట్లు రావని ఎన్నికలకు ముందే వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని తనదైన శైలిలో చెప్పాల్సింది చెప్పేశారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నుంచి వచ్చే వారిని కూడా తీసుకుంటామని బాబు అంటున్నారు. ఎవరైనా వైసీపీలో చేరాలని చూస్తే పరిశీలిస్తామని చెబుతున్నారు.

దీంతోనే బాబు రాజకీయ చాణక్యం ఏంటి అన్నది బయటపడుతోంది అని అంటున్నారు. అయినా టీడీపీలో చేరినా వైసీపీ నేతలకు ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్నదే ప్రశ్నగా ఉంది. టీడీపీలో సిట్టింగులు 19కి సీట్లు ఖాయం. అలాగే జనసేనకు ముప్పయి దాకా సీట్లు ఇస్తారనుకున్నా అక్కడికి యాభై సీట్లు పూర్తి అవుతాయి. బీజేపీ చివరి నిముషంలో చేరితే వారికి ఒక పది దాకా సీట్లు ఇవ్వాలి.

అలా కాదని కమ్యూనిస్టులను చేర్చుకున్నా ఆ సీట్లు ఇటు టర్న్ అవుతాయి. దాంతో టీడీపీకి పోటీ చేయడానికి మిగిలేవి 115 సీట్లు మాత్రమే. మరి ఇందులో కూడా వైసీపీ నుంచి వచ్చే పాతిక ముప్పయి మందికి సర్దేస్తే మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారి సంగతి ఏమి కావాలని అంటున్నారు.

ఇప్పటికే పొత్తుల సీట్లలో తమ్ముళ్ళు ఖాళీ అవుతారు. సిట్టింగులకు సీట్లు అంటే అక్కడ నేతలకు ఎటూ చాన్స్ లేదు. ఇపుడు వైసీపీలో అయిదేళ్ల కాలం అధికారంలో ఉండి వచ్చిన వారికి టికెట్లు ఇస్తే ప్రతిపక్షంలో ఉంటూ అయిదేళ్ళు పోరాడిన టీడీపీ నేతల సంగతేంటి అన్న చర్చ ఉంది.

మరో వైపు చూస్తే ఇదే చంద్రబాబు వైసీపీని విమర్శిస్తున్నారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు మరో నియోజకవర్గంలో చెల్లుతుందా అని. మరి పార్టీ మారితే అదే చెల్లని కాసు మంచి కాసు అవుతుందా అన్నది బాబు మాత్రేమే చెప్పాలని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం డ్యాం ష్యూర్ గా గెలుస్తామని ఒక వైపు చెబుతున్నారు. అయినా వైసీపీ నేతల వైపు ఎందుకు చూడడం అన్నదే తమ్ముళ్లకు కూడా అర్ధం కావడంలేదుట.