Begin typing your search above and press return to search.

బచ్చా అంటున్న బాబు...అచ్చా అంటున్న తమ్ముళ్ళు ...!

తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు అయితే తన అవేశాన్ని అంతా చూపించారు. ఏడున్నర పదుల వయసు ఉన్న నేత ఈయనేనా అనిపించేలా బాబు కనిపించారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 3:31 AM GMT
బచ్చా అంటున్న బాబు...అచ్చా అంటున్న తమ్ముళ్ళు ...!
X

రాజకీయాల్లో విలువలు ఎపుడో పోయాయి. మర్యాదతో కూడిన మాటలకు కాలం చెల్లింది. శత్రువుల కంటే దారుణంగా తిట్టుకోవడం ఒకరిని ఒకరు కించ పరచుకోవడమే నేటి రాజకీయం అయింది. రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా అడుగంటిన కాలమిది. దీనికి ఎవరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. అంతా ఆ తానులో గుడ్డలే.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో బాబు తన స్టైల్ మార్చారు. బాడీ లాంగ్వేజ్ నుంచి అంతా మార్చేశారు. ప్రతీ మాటకూ దీర్ఘాలు తీస్తున్నారు. బాబును ఆయన స్పీచ్ లను 1995 నుంచి చూస్తున్న వారికి ఇదొక కొత్త అనుభవమే. చంద్రబాబు అంటే సుదీర్ఘమైన ఉపన్యాసాలకు పెట్టింది పేరు.

కానీ ఇపుడు చిన్న డైలాగులతో క్యాచీ గా ఉండే మాటలతో సౌండ్ చేస్తున్నారు. యూత్ ని అట్రాక్ట్ చేయడం తో పాటు అప్టూ డేట్ గా తాను ఉండాలని అనుకుని బాబు చేస్తున్న పరిశ్రమ ఇదంతా అంటున్నారు. వీటి వరకూ బాగానే ఉన్నా బాబు వంటి సీనియర్ మోస్ట్ లీడర్ నోటి వెంట రాకూడని మాటలు కూడా ఈ ఊపులో ఉత్సాహంలో దొర్లేస్తున్నాయి.

ఆయన ఇటీవల కుర్చీ మడత బెట్టి అంటూ వాడిన పదం క్యాచీగా ఉందనుకున్నారు. కానీ అది అశ్లీల పదం అని తెలుసో తెలియదో అని చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి పదాలు ఎవరైనా వాడితే వాడొచ్చు కానీ బాబు వంటి సీనియర్ వాడకూడదు అనే అంతా కోరుకుంటారు.

ఇక వ్యక్తిగత విమర్శలకు బాబు వెరవడంలేదు. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు అయితే తన అవేశాన్ని అంతా చూపించారు. ఏడున్నర పదుల వయసు ఉన్న నేత ఈయనేనా అనిపించేలా బాబు కనిపించారు. ఒక విధంగా విశ్వరూపమే చూపించారు.

ఈ సభంలో బాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించడం పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఆయన నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా అంటూ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ పులివెందుల కూడా మేం గెలవబోతున్నాం కాస్కో జగన్ మోహన్ రెడ్డీ అంటూ సవాల్ విసిరారు.

జగన్ కు నేను భయపడను. నన్ను పని చేయకుండా అడ్డుకోవడం నిన్ను పుట్టించిన వాడికి కూడా చేతకాదు. తండ్రిని అడ్డం పెట్టుకుని 43 వేల కోట్ల రూపాయలను జగన్ దోచుకున్నాడని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఎంత దోచుకున్నా జగన్ లో మార్పు రాలేదు. ఊరూరు తిరిగి, తల నిమిరితే మీరు కరిగిపోయి ఓట్లు వేశారు. ఆ తర్వాత మీ ల్యాండ్ , స్యాండ్, వైన్, మైన్ ఇలా ఏదీ వదిలి పెట్టలేదు. జగన్‌కు ఉదయం టిఫెన్ సాండ్, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రికి జే బ్రాండ్ మద్యం కావాలని అంటూ చంద్రబాబు స్పీచ్ సాగింది.

అంతే కాదు అంతే కాదు మేం మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డీ అంటూ చంద్రబాబు మండిపోయారు. ఈ మీటింగ్ చూసి జగన్ మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయింది అని దీర్ఘాలు కూడా తీశారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సునామీ సృష్టించడం ఖాయమని జోస్యం చెప్పారు. గెలుపు మనదే ఎవరికైనా అనుమానం ఉందా అని చంద్రబాబు సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు.

మన గెలుపునకు ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతామే తప్ప నిలిచేదే లేదు అని స్పష్టం చేసారు. మీరు జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం అలాగే, వైసీపీని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధం అని కూడా చంద్రబాబు గర్జించారు. చంద్రబాబులో ఇంతలా ఆవేశం ఈ మధ్యకాలంలో చూడలేదని తమ్ముళ్ళు కూడా అంటున్నారు. బాబు ఆవేశానికి వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. జగన్ ని పట్టుకుని బచ్చా అంటూంటే అచ్చా అంటున్నారు తమ్ముళ్ళు. హుషార్ తేవడానికి ఓకే కానీ కొన్ని పదాలు రాజకీయల్లో మాట్లాడకపోవడమే మంచిది అని అంటున్నారు. హుందాగా సీనియర్ నేతలు అయినా ఉండాలి కదా అన్నదే జనం అభిమతంగా ఉంది.