Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ లేడీ కాంట్ర‌వ‌ర్సీ పాలిటిక్స్‌.. చంద్ర‌బాబుకు పెద్ద స‌వాలే..!

ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ పెట్టారు. అయితే.. ఈ స‌భ‌ను ఓన్ చేసుకున్న అఖిల ప్రియ‌.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించింది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 1:30 AM GMT
ఆ టీడీపీ లేడీ కాంట్ర‌వ‌ర్సీ పాలిటిక్స్‌.. చంద్ర‌బాబుకు పెద్ద స‌వాలే..!
X

సమస్యల నుంచే సమస్యకు పరిష్కారం.. ఇది తరుచూ చంద్రబాబు చెప్పే మాట. కానీ ఇప్పుడు వివాదం నుంచి కూడా పరిష్కారానికి బాట అవుతుందా? సభల ముంగిట్లో రభస.. అందుకు సంకేతమా? విజయవాడ బాటలో ఇప్పుడు ఆళ్లగడ్డ పంచాయితీ మ‌రోసారి తెరపైకి వచ్చింది. ఆళ్లగడ్డ టికెట్‌ ఎవరికి? అధినేత పర్యటనకు ముందు.. త‌ర్వాత కూడా.. నంద్యాల జిల్లాలో ఈ ప్రశ్న హాట్‌ టాపిక్‌గా మారింది.

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం గ‌త కొన్నాళ్లుగా తీవ్ర వివాదాల‌కు కేంద్రం గా మారింది. ఇక్క‌డ వైసీపీ నేత బ్రిజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న‌ను ఢీ కొట్టి ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నది దివంగ‌త భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి అఖిల ప్రియ ఉద్దేశం. అయితే.. ఇక్క‌డే ఆమెకు, పార్టీకి కూడా ఎన్నికల వేళ రాజ‌కీయ తిప్ప‌లు ఎదుర‌య్యాయి. ఆమె దూకుడు.. పార్టీ నాయ‌కుల‌కు ఏమాత్రం న‌చ్చ‌డం లేదు.

ఆళ్ల‌గ‌డ్డ టికెట్‌ను పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి ఆశిస్తున్నారు. ఈయ‌న‌కు టీడీపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ద‌న్నుగా కూడా ఉన్నారు. దీంతో ఆళ్ల‌గ‌డ్డ టికెట్ విష‌యం పెద్ద పంచాయ‌తీగా మారింది. మ‌రోవైపు.. స్థానిక కేడ‌ర్‌.. అఖిల ప్రియ‌కు క‌డు దూరంగా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ పెట్టారు. అయితే.. ఈ స‌భ‌ను ఓన్ చేసుకున్న అఖిల ప్రియ‌.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించింది.

ఇదే స‌మ‌యంలో చంద్రబాబు పాల్గొన్న ఈ సభకు ఏవీ సుబ్బారెడ్డి రాకూడదని అఖిల అల్టిమేటం జారీ చేయ‌డంతోపాటు.. ఆయన వస్తే రచ్చ తప్పదని హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు.. తాను సైలెంట్‌గా ఉన్నా, అనుచరులు ఊరుకోబోరని వార్నింగ్ ఇచ్చి హ‌డావుడి చేసింది. దీంతో ఏవీ సుబ్బారెడ్డికి సర్దిచెప్పిన పార్టీ పెద్దలు ఆయ‌న‌ను ఊర‌డించారు. మొత్తానికి స‌భ స‌మాప్తం అయింది. స‌క్సెస్ సాధించింది. కానీ.. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈవివాదం మాత్రం స‌మ‌సి పోలేదు. టికెట్ విష‌యంపై చంద్ర‌బాబు ఎటూ తేల్చ‌లేదు. దీంతో వివాదం అలానే ఉండిపోయి.. ప‌రిష్కారం మాత్రం క‌నిపించ‌కుండా పోయింది.