Begin typing your search above and press return to search.

చంద్రబాబు మరో పిటిషన్‌.. కోర్టు నిర్ణయంపై తారాస్థాయిలో ఉత్కంఠ!

ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో లంచ్‌ మోషన్‌ కింద బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   11 Sep 2023 8:48 AM GMT
చంద్రబాబు మరో పిటిషన్‌.. కోర్టు నిర్ణయంపై తారాస్థాయిలో ఉత్కంఠ!
X

2014–2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఇంటి నుంచే భోజనం, మందులు తెప్పించుకోవడానికి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది.

మరోవైపు చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫున కేసు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ బెయిల్‌ పిటిషన్‌ ను కోర్టు తిరస్కరిస్తే హౌస్‌ అరెస్టు (గృహనిర్బంధం)లో అయినా ఉంచాలని కోరనున్నారు. ఈ మేరకు రెండు పిటిషన్లు చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిద్ధం చేశారు.

ఇంకోవైపు ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చే అవకాశం కనిపించడం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో లంచ్‌ మోషన్‌ కింద బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది మధ్యాహ్న భోజనం తర్వాత విచారణకు రానుంది.

మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్‌ కోసం పీటీ వారెంట్‌ (ప్రిజనర్‌ ఇన్‌ ట్రాన్సిట్‌) కోరింది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌ పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, ఏ6గా నారా లోకేష్‌ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్‌ లో కోరింది.

కాగా చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ పై మధ్యాహ్నం 2.30కి వాదనలు మొదలవుతాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి.. చంద్రబాబు తరపున లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్‌ ను.. హౌజ్‌ అరెస్ట్‌ గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ పైనా వాదనలు జరుగుతాయి.

ఇప్పటికే చంద్రబాబు హౌజ్‌ అరెస్టు కు అవకాశం ఇవ్వాలని ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఏఏజీ అందుబాటులో లేరని.. సమయం ఇవ్వాలని సిట్‌ స్పెషల్‌ జీపీ న్యాయమూర్తికి విన్నవించారు. దీంతో.. హౌజ్‌ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని జడ్జి ఆదేశిస్తూ.. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

కాగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు తరపున ఇంకా బెయిల్‌ పిటిషన్‌ దాఖలు కాలేదని ఆయన తెలిపారు. చంద్రబాబుని ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశామన్నారు. చంద్రబాబు భద్రతా పరంగా చూసుకుంటే.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు కంటే మంచి చోటు ఉండదు అని పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి చెబుతుండటం గమనార్హం.

మరోవైపు చంద్రబాబు బెయిల్‌ కు సంబంధించి ఆయన లాయర్‌ సిద్దార్ద్‌ లూత్రా హాట్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందన్నారు. ఆయన్ను జైల్లో ఉంచడం ప్రమాదకరమని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వకపోతే హైకోర్టు ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది.