గమనించారా? గురువు బాబుకు శిష్యుడు కేసీఆర్ కు ఒకే సీన్ రిపీట్!
ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఓడిన కేసీఆర్ కు.. ఆయన ఒకప్పటి రాజకీయ గురువు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ ఒకేలా ఉందేమిటన్న పోలిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 10 Dec 2023 1:30 PMగడిచిన మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లోచోటు చేసుకుంటున్న పరిణామాలు సరికొత్త చర్చకు.. కొత్త వాదనలకు తెర తీస్తున్నాయి. అంతేకాదు.. గతంలో జరిగిన అంశాల్ని వర్తమానంలో జరుగుతున్న అంశాలతో పోల్చి చూపుతూ.. ఆసక్తికరంగా చెప్పే కథనాలు అప్పుడప్పుడు తెర మీదకు వస్తుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యన అలాంటి ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అలాంటి వాదనే ఒకటి తెర మీదకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఓడిన కేసీఆర్ కు.. ఆయన ఒకప్పటి రాజకీయ గురువు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ ఒకేలా ఉందేమిటన్న పోలిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సొంత మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు (నిజానికి ఈ వాదనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది మర్చిపోకూడదు) పొడిచి అధికారాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు నాన్ స్టాప్ గా తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించారని చెప్పాలి.
ఈ సందర్భంగా ఆయనకు ఎదురు లేదని.. ఆయనకు పోటీ వచ్చే వారే ఎవరూ ఉండరని.. చంద్రబాబు చాణుక్యుడిని ఢీ కొట్టే టాలెంట్ మరెవరికీలేదన్న వాదన జోరుగా వినిపించేది. ఇలాంటి వేళ.. అంచనాలకు భిన్నంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెర మీదకు రావటం.. అప్పటికే పలుమార్లు చంద్రబాబు చేతుల్లో చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఆయన.. 2004 ఎన్నికల్లో అదరగొట్టే ఫలితాల్నిసొంతం చేసుకోవటం ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేయటం తెలిసిందే. కట్ చేస్తే.. పదేళ్ల పాటు కాంగ్రెస్ హవా నాటి ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకుంది. అదే సమయంలో తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి కింగ్ గా ఉన్న చంద్రబాబు ఆ తర్వాత ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అప్పట్లో చంద్రబాబు శిష్యుడిగా కేసీఆర్ సుపరిచితుడు. 2004 ఎన్నికలకు ముందు.. గురువుతో విభేదించి సొంతంగా పార్టీ పెట్టిన కేసీఆర్.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టటం.. వైఎస్ ఘన విజయంలోకీ రోల్ ప్లే చేయటం తెలిసిందే. తాజాగా శిష్యుడు కేసీఆర్ వ్యవహారాన్ని చూస్తే.. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో అంచనాలకు భిన్నంగా అధికారాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్. కట్ చేస్తే.. ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల పదవీ కాలాన్ని ముందుగా ఎన్నికలకు వెళ్లటం ద్వారా ఐదేళ్లకు దాదాపు ఐదారు నెలల ముందే ఎన్నికలకు వచ్చేశారు.
2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి అధికారాన్ని సొంతం చేసుకున్నారు. మొది టర్మ్ లో నాలుగున్నరేళ్లు.. రెండో దఫా ఐదేళ్లు (సరిగ్గా లెక్కేస్తే.. రెండు దపాలుగా చూసినప్పుడు మొత్తం పదవీ కాలం తొమ్మిదిన్నరేళ్లు మాత్రమే వస్తుంది రోజుల తేడాతో) అధికారంలో ఉన్నారు. కానీ.. పక్కా లెక్కగా చూస్తే.. తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు రేవంత్ చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పట్లో చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి. అప్పుడు టీడీపీ.. ఇప్పుడు బీఆర్ఎస్ (ఒకప్పటి టీఆర్ఎస్). అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడూ కాంగ్రెస్. మొత్తంగా గురువు చంద్రబాబుకు మాత్రమే కాదు శిష్యుడు కేసీఆర్ కు కూడా తొమ్మిదిన్నరేళ్ల షాక్ తగిలిన వైనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పోలికల్ని చూస్తే.. నిజమేనన్న భావన కలుగక మానదు.