జగన్ లాంటి వ్యక్తిని బాబు ఎపుడూ చూడలేదా ?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు రాజకీయంగా తలపండిన వారు. జీవితంలో కూడా ముప్పాతిక జీవితాన్ని ఆస్వాదించిన వారు.
By: Tupaki Desk | 3 May 2024 9:28 AM ISTటీడీపీ అధినేత నారా చంద్రబాబు రాజకీయంగా తలపండిన వారు. జీవితంలో కూడా ముప్పాతిక జీవితాన్ని ఆస్వాదించిన వారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది మూడు సార్లు సీఎం గా మరో మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎపుడూ చెప్పే మాట ఒక్కటే. తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని ఎపుడూ చూడలేదు అని. అలాంటి వ్యక్తిని తాను ఎపుడూ ఊహించలేదని.
చంద్రబాబు రాజకీయ విమర్శల్గా దీనిని చూడాలా లేక జగన్ అందరి రాజకీయ నాయకుల మాదిరి లాంటి వారు కారా అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయంలో చంద్రబాబుతో ఏకీభవించాల్సిందే. ఎలాంగంటే జగన్ లాంటి పొలిటీషియన్ ని మాత్రం కేవలం చంద్రబాబు మాత్రమే కాదు ఏపీ మాత్రమే కాదు దేశం కూడా చూడలేదు అని. చంద్రబాబు నెగిటివ్ అప్రోచ్ లో చెబితే వైసీపీ నేతలు పాజిటివ్ అప్రోచ్ లో మా అధినేత లాంటి వారు ఎవరూ లేరు ఆయన రేర్ పొలిటికల్ పర్సనాలిటీ అని గొప్పగా చెబుతారు.
ఎవరు ఏమి చెప్పినా ఎలా చెప్పినా న్యూట్రల్ పర్సన్స్ కూడా పాలిటిక్స్ లో జగన్ వేరే తీరు అని అంగీకరిస్తారు. అది ఎలా అంటే ఆయనకు పట్టుదల ఎక్కువ పట్టు మాత్రమే తెలుసు అని అంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు పట్టూ విడుపూ రెండూ అనుసరిస్తారు. రాజకీయం అంటేనే టఫ్ జాబ్. అందులో ఎపుడూ విజయాలు రావు. అపజయాలు కూడా వస్తాయి అనుకున్నది కూడా జరిగిన సందర్భాలు ఉండవచ్చు లేకపోవచ్చు.
అపుడు విడుపు మార్గం అవసరం అని అంటారు. వైఎస్ జగన్ తండ్రి మాజీ సీఎం దివంగత వైఎస్సార్ లో పట్టూ విడుపూ కూడా ఉన్నాయి. తెలుగు రాజకీయాల గురించే మాట్లాడుకుంటే రాష్టాన్ని పాలించిన సీఎంలు అందరికీ ఈ పట్టూ విడుపూ సూత్రాలు బాగా తెలుసు. జగన్ మాత్రం అలా కాదు తాను అనుకున్నది చేసుకుంటూ పోతారు అని అంటారు. అందులో పరాజయం పలు మార్లు వెక్కిరించినా ఆయన వెనక్కి తగ్గరు.
ఆయన గుండె ధైర్యం కూడా ఎక్కువే అంటారు. అందుకే ఆయన సాధారణ రాజకీయ నాయకుల జాబితాలో ఉండరు. ఆయనకు ఆ పోలికలు నప్పవు. ఆయన సీఎం గా అయిదేళ్ల పాలన తీసుకుంటే విపక్షాన్ని ముప్పతిప్పలు పెట్టారు అని వారు అంటారు తప్పు చేస్తే ఎవరైనా ఇంతే అన్నది వైసీపీ అధినేత నుంచి వచ్చే జవాబు. ఎంతదాకా అయినా అంటూ ముందుకు సాగే ఈ దూకుడే ఇపుడు ఏపీలో విపక్షం మొత్తాన్ని ఏకం చేసింది. చంద్రబాబు అరెస్ట్ దానికి పరాకాష్ట అని చెబుతారు.
ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ఏదో సభలో అన్నట్లుగా చంద్రబాబు లాంటి వారికే అరెస్టులు అనివార్యం అయితే మిగిలిన వారి సంగతేంటి అన్నదే విపక్ష శిబిరం ఆందోళన. భయం. ఇక అధికారంలో ఎవరు ఉన్నా విపక్షం తో రాజీలు సయోధ్యలు ఉంటాయి. వారూ వీరూ ఎక్కడో ఒక చోట సహకరించుకుంటారు.
రాజకీయాన్ని అలాగే చూస్తారు. తమదాకా రానీయరు. కానీ జగన్ అలా కాదు విపక్షాన్ని ఆమడ దూరంలోనే ఉంచారు. అందుకే చంద్రబాబు అంటున్న మాట ఇలాంటి నేతను ఎక్కడా చూడలేదని. జగన్ ది ముక్కుసూటితనం. ఆయన తాను నమ్మినది చేస్తారు. అది రాజకీయాల్లో ఎక్కువ సార్లు సరిపడదు, కానీ జగన్ మాత్రం అదే తన మార్గం అంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన రాజకీయ నాయకులకు కొత్తగా కనిపిస్తున్నారు.
జగన్ లాంటి వారిని ఎపుడూ చూడలేదని చంద్రబాబు విమర్శనాత్మకంగా అన్నా అలాంటి పట్టుదల కలిగిన నేత కూడా కావాల్సిన అవసరం ఉందని అనే వారూ ఉన్నారు. వైసీపీ వారు అయితే జగన్ దే కరెక్ట్ అని కూడా అంటారు. కానీ సగటు రాజకీయ నేతలకు జగన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉంటారు. విపక్షాలు అది ఒప్పుకోలేక సైకో అని అంటాయి. తాను జగన్ ని సైకో అని ముద్దుగా పిలుస్తాను అని చంద్రబాబు అంటున్నారు.
రాజకీయంగా జగన్ రూట్ అది. ఆయన పంధా నయా ట్రెండ్. బాబు ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ ని చూస్తూ వస్తున్నారు. ఇపుడు తరం జగన్ వైఖరిని ఇష్టపడుతున్నారు అన్నది వైసీపీ నేతలు చెప్పే మాట. బాబు జగన్ లాంటి వారిని చూడలేదు అంటే అది ఆయనకు జగన్ కి ఉన్న జనరేషన్ గ్యాప్ అని కూడా అంటున్నారు. జగన్ కోణం జనం కోణమని సైకో అన్నది విపక్షం ఎలా పిలిచినా జనం మెప్పుదలే జగన్ కి కొలమానం అని వైసీపీ నేతలు చెబుతారు.
