ఏపీలో మంత్రులకు 'వర్క్ ఫ్రం హోం'
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రులకు `వర్క్ ఫ్రం హోం` ఇస్తూ.. సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By: Tupaki Desk | 30 Jun 2025 5:39 PM ISTఏపీలో చిత్రమైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రులకు `వర్క్ ఫ్రం హోం` ఇస్తూ.. సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే.. ఇది అందరికీ వర్తిస్తుందా? లేక.. టీడీపీ పరివారానికే పరిమితం అవుతుందా? అన్నది క్లారిటీ లేదు. కానీ.. మౌఖికంగా మాత్రం చంద్రబాబు మంత్రులు అందరూ ఇక నుంచి నెల రోజుల పాటు వర్క్ ఫ్రం హోం చేయండి అని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. ముఖ్యమైన ఫైళ్లను, లేదా పనులను మాత్రమే ఈ నెల రోజుల కాలంలో చూడాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇతర విషయాలేవీ పెట్టుకోవద్దన్నారు. పుట్టిన రోజులు, పెళ్లి రోజులు ఉన్నా.. ఆడంబరాలకు పోయి.. సమయం వృధా చేసుకోవద్దని కూడా ఆయన సూచించారు. ఈ నెల రోజులు కూడా ప్రత్యేకంగా కేటాయించాలని.. సాయంత్రం పూట మాత్రమే ఇంటికి పరిమితమై.. వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎందుకీ నిర్ణయం?
ఎంతో ఆసక్తిగా మారిన ఈ వర్క్ ఫ్రం హోం నిర్ణయం వెనుక.. చంద్రబాబు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని బుధవారం నుంచి చేపట్టనున్నారు. తద్వారా.. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించనున్నారు. ఇంటింటికీ వెళ్లే నాయకులు.. ప్రజల ను కలుసుకుని.. వారికి అందిన ఫలాలు.. ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని సమగ్రంగా వివరిస్తారు. ఈ క్రతువులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇతర పర్యటనలు పెట్టుకోవడం మానుకోవాలన్నారు. దీంతోపాటు.. అమరావతికి కూడా తరచుగా రావాల్సిన అవసరం లేదని.. ఎప్పుడైనా అవసరమైతే.. మాత్రమే తాను పిలుస్తానన్నారు. అయితే.. ఇంపార్టెంట్ ఫైళ్ల వ్యవహారాన్ని మాత్రం ఇంటి నుంచే చేయాలన్నారు. కానీ.. సుపరిపాలన కార్యక్రమాన్ని మాత్రం సక్సెస్ చేయాలని తేల్చి చెప్పారు.
