మాజీ మంత్రి వివేకా కేసులో కీలక మలుపు.. సునీత పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పు
మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By: Tupaki Desk | 11 Dec 2025 10:44 AM ISTమాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు మధ్యలోనే ఆపేసిందని, హత్యపై ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయని, మొత్తం కుట్రను వెలుగులోకి తేవాలని కోరుతూ వివేకా కుమార్తె సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సూచనలతో విచారణ జరిపిన సీబీఐ కోర్టు సీబీఐ దర్యాప్తుపై కొన్ని సూచనలు చేస్తూ ఆదేశాలిచ్చింది. గురవారం రాత్రి పొద్దుపొయేవరకు విచారణ జరిపిన న్యాయస్థానం రాత్రి 9 గంటల సమయంలో తీర్పు ఇచ్చింది.
సీబీఐ కోర్టు ఉత్తర్వులు మేరకు వివేకా హత్య కేసులో మళ్లీ పాక్షిక దర్యాప్తు కొనసాగనుంది. 7వ నిందితుడు వైఎస్ భాస్కరరెడ్డి తమ్ముడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డికి, రెండో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ముందుగా హత్య సమాచారాన్ని ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ ఇద్దరి టెలిఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసులో సునీత సందేహాలు లేవనెత్తిన మిగిలిన నిందితులపై విచారణకు కోర్టు అనుమతించలేదు. అంతేకాకుండా పాక్షిక దర్యాప్తును నెలరోజుల్లో ముగించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, సునీత లేవనెత్తిన ప్రధాన సందేహాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంతో నిందితులకు కాస్త ఉపశమనం లభించినట్లేనంటున్నారు. హత్య జరిగిన రోజు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ వాడుకలోనే ఉందని, ఆయన మాజీ సీఎం జగన్ కు హత్యపై ముందే సమాచారం ఇచ్చి ఉంటారని సీబీఐ సందేహం వ్యక్తం చేసిందని, అయితే ఈ విషయంపై దర్యాప్తు జరపలేదని సునీత కోర్టుకు నివేదించారు. రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లం తన వాంగ్మూలంలో ఉదయం 5 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లో తాము జగన్ తో సమావేశంలో ఉండగా, భారతీ నుంచి జగన్ రెడ్డికి పిలుపువచ్చిందని, ఆ తర్వాత జగన్ రెడ్డి తమతో వివేకా మరణంపై చెప్పారని అజేయ్ కల్లాం వాంగ్మూలమిచ్చారు. ఇక్కడ భారతికి ఎలా సమాచారం వచ్చింది? ఎవరి నుంచి వచ్చిందన్న అంశంపై సీబీఐ దర్యాప్తు చేయలేదని, ఆ విషయంపైనా దర్యాప్తు కొనసాగాలని సునీత పిటిషన్ వేశారు.
ఇవేకాకుండా హత్య దర్యాప్తును సీబీఐ సగంలోనే వదిలేసిందని, నిందితులు పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు ఇవ్వడంపైనా సీబీఐ దృష్టిపెట్టలేదని సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కోర్టు మాత్రం సునీత లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ మధ్య జరగిన సంభాషణలపైనే విచారణ జరపాలని ఆదేశించింది. కాగా, హత్య జరిగిన రోజు తెల్లవారుజాము 1.42 గంటల సమయంలో కిరణ్ యాదవ్ నుంచి అర్జున్ రెడ్డి ‘వివేకా సర్ చనిపోయాడు’ అనే మెసేజ్ వెళ్లిందని సీబీఐ గుర్తించింది. కానీ, ఆ మెసేజ్ పై దర్యాప్తు చేయలేదని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ విషయంపైనే దర్యాప్తు కొనసాగనుంది.
