Begin typing your search above and press return to search.

కుల సంఘాల డిమాండ్లు పెరిగిపోతున్నాయా ?

అలాంటి డిమాండ్లే ఇపుడు ఏపీలో వినబడుతున్నాయి. తమ జనాభా దామాషా ప్రకారం తమ సామాజికవర్గాలకు టికెట్లిచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Feb 2024 8:30 AM GMT
కుల సంఘాల డిమాండ్లు పెరిగిపోతున్నాయా ?
X

తెలంగాణా ఎన్నికల్లాగే ఏపీ లో కూడా టికెట్ల కోసం కుల సంఘాల డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తెలంగాణా ఎన్నికలకు ముందు మున్నూరు కాపు, ముదిరాజ్, ముస్లిం మైనారిటీలు తమకు ఎక్కవ టికెట్లు కావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జనాభా దామాషా ప్రకారం తమ సామాజిక వర్గాలకు టికెట్లను కేటాయించాల్సిందే అని అన్నీ పార్టీలను ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను డిమాండ్లు చేశాయి. అయితే మున్నూరుకాపు, ముదిరాజ్, ముస్లిం మైనారిటీల డిమాండ్లను కేసీయార్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ మాత్రం కొంతమేర వీళ్ళని సంతృప్తి పరిచింది.

అలాంటి డిమాండ్లే ఇపుడు ఏపీలో వినబడుతున్నాయి. తమ జనాభా దామాషా ప్రకారం తమ సామాజికవర్గాలకు టికెట్లిచ్చి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లను కాదని నడుచుకుంటే బుద్ధిచెప్పి తీరుతామని కూడా వార్నింగ్ ఇస్తున్నాయి. వైజాగ్ లో బ్రాహ్మణ విప్రోత్సవ సభ జరిగింది. రాబోయే ఎన్నికల్లో పార్టీలు బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చి తీరాల్సిందే అన్నట్లుగా తీర్మానం చేసింది. తమకు ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లిస్తుందే ఆ పార్టీకే తమ మద్దతుంటుందని కూడా ప్రకటించింది.

ఇలాంటి డిమాండ్లనే ఈ మధ్య వెలమ, వైశ్య సామాజికవర్గాలు కూడా చేశాయి. నిజానికి బ్రాహ్మణ, వెలమ, వైశ్య సామాజికవర్గాల జనాభా చాలా తక్కువ. వీటిల్లో కూడా వెలమలు అయితే మరీ మరీ తక్కువ. జనాభాను పక్కనపెట్టేస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించేంత స్ధాయిలో పై సామాజికవర్గాల్లో నేతలు ఎవరూ లేరన్నది వాస్తవం. మొదటి నుండి రెడ్డి, కమ్మ సామాజికవర్గాల చేతిలోనే అధికారం ఉంటోంది. రెడ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నపుడు మంత్రివర్గాల్లో బ్రాహ్మణ, వైశ్య నేతలుండేవారంతే. వెలమలు అయితే అదికూడా తక్కువనే చెప్పాలి.

పై మూడు సామాజికవర్గాల్లోని సమస్య ఏమిటంటే కట్టుబాటు లేకపోవటమే. వ్యక్తిగతంగా ఏ పార్టీ తమకు ప్రాధాన్యత ఇస్తుందో పై మూడుసామాజికవర్గాల్లోని నేతలు వాటిల్లో కంటిన్యు అవుతున్నారు. పదవుల్లో ఉన్నపుడు తమ సామాజికవర్గాలకు ఏమన్నా మేళ్ళు చేస్తున్నారా అంటే అనుమానమే. కాబట్టి పై మూడుసామాజికవర్గాలకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోయినా చేసేదేమీ కూడా ఏమీ ఉండదు. ఏదో ఎన్నికలకు ముందు ప్రచారం కోసం బెదిరింపులు చేయటమంతే.