Begin typing your search above and press return to search.

ప్రాణాల మీదకు తెచ్చిన చనక్కాయ గింజ

కొండాపూర్ కు చెందిన విజయలక్ష్మి ఇటీవల కాలంలో తీవ్రమైన దగ్గు.. జ్వరం.. ఆయాసంతో కిందా మీదా పడుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:26 AM GMT
ప్రాణాల మీదకు తెచ్చిన చనక్కాయ గింజ
X

టైం బాగోకపోతే అంతే. టెంకాయ సైతం టైం బాంబ్ మాదిరి అవుతుందంటారు. అలాంటి ఉదంతమే హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒకరికి ఎదురైంది. రోజువారీ అలవాటుగా తినే ఒక చనక్కాయ గింజ.. అదేనండి పల్లీ గింజ ప్రాణం మీదకు తెచ్చిన వైనం గురించి తెలుసుకున్న వైద్యులు సైతం అవాక్కు అవుతున్నారు.పల్లీ గింజ ఎంత పని చేసిందని వారు ఆశ్చర్యపోతున్నారు.

కొండాపూర్ కు చెందిన విజయలక్ష్మి ఇటీవల కాలంలో తీవ్రమైన దగ్గు.. జ్వరం.. ఆయాసంతో కిందా మీదా పడుతున్నారు. ఆ మధ్య వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేని ఆమెకు.. ఉన్నట్లుండి మొదలైన ఈ జబ్బులతో హడలిపోయారు. తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటివేళ.. వైద్యుల్ని సంప్రదిస్తున్నా.. ఫలితం లేని పరిస్థితి.

ఇదే సమయంలో నానక్ రాంగూడలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు.. ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు పరీక్షలు నిర్వహించారు డాక్టర్ కిషన్. తనకున్న అనుమానంతో ఆమెకు సిటీ స్కాన్ ను రాశారు.

ఈ రిపోర్టులో శ్వాసనాళాలు.. ఊపిరితిత్తుల మధ్య ఏదో చిన్నదేదో ఇరుక్కున్నట్లుగా గుర్తించారు. దాని కారణంగానే న్యూమోనియాకు దారి తీసినట్లుగా తేల్చి.. వెంటనే బ్రాంకోస్కోపీ ద్వారా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న దాన్ని బయటకు తీశారు.

అంత ప్రయాసకు గురై.. బయటకు తీసిన దాన్ని చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. కారణం.. అది చిన్న పల్లీ గింజ. ఇంతకీ అదెలా అక్కడకు వచ్చిందన్న విషయాన్ని ఆరా తీయగా.. అసలు విషయం బయటకు వచ్చింది. విజయలక్ష్మికి వేయించిన వేరుశెనగ గింజలు తినటం ఇష్టం.

రోజువారీగా ఆమె వాటిని తింటుంటారు. అలా తినే వేళలో.. ఒకపక్కకు ఒరిగి తిన్న వేళలో.. ఒక పప్పు పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇరుక్కుంది. దీని కారణంగా జ్వరం.. ఆయాసం.. విపరీతమైన దగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చిన్న పల్లీ గింజ ఎంత పని చేసిందన్నది ఇప్పుడు చర్చగా మారింది.