Begin typing your search above and press return to search.

రికార్డ్... ఆ విషయంలో అమెరికాను అధిగమించిన భారత్!

మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఒక విషయంలో మాత్రం అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది

By:  Tupaki Desk   |   22 Jan 2024 10:09 AM GMT
రికార్డ్... ఆ విషయంలో అమెరికాను అధిగమించిన భారత్!
X

మిగిలిన విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా ఒక విషయంలో మాత్రం అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. పైగా అక్కడ మూడేళ్లలో జరిగేది భారత్ లో ఒక నెలలోనే జరిగింది. అంటే అది ఏస్థాయి రికార్డో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాలను నైజీరియా పర్యటనలో ఉన్న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ తాజాగా వెల్లడించారు.

అవును... అమెరికాను భారత్‌ అధిగమించిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. నగదు రహిత చెల్లింపుల్లో ఇది సాధ్యమైందని తెలిపారు. ఇందులో భాగంగా... మన దేశంలో ఒక నెలలో జరిపే డిజిటల్‌ చెల్లింపులు.. అమెరికాలో మూడేళ్లలో జరుగుతాయని తెలిపారు.

తాజాగా నైజీరియాలోని ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్‌ తయారీ, సరఫరా మొదలైన విషయాల గురించి ప్రవాసులతో మాట్లాడారు. ఇందులో భాగంగా.. భారతీయుల జీవన విధానం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో సులభంగా మారిందని అన్నారు.

ఇదే సమయంలో ప్రస్తుతం భారత్ లో అతి తక్కువ మంది మాత్రమే క్యాష్ పేమెంట్స్ చేస్తున్నారని.. గరిష్టంగా భారత ప్రజానికం డిజిటల్ చెల్లింపులే చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే... మనదేశంలో ఒక నెలలో జరిగిన క్యాష్ లెస్ పేమెంట్స్ యూఎస్ లో మూడేళ్లలో జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇక భారతదేశంలో రవాణా, మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. కరోనా కష్టకాలంలో ఎదురైన సవాళ్లను అధిగమించడమే కాకుండా... ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ అందజేసే స్థాయికి భారత్ ఎదిగిందని.. ఈ క్రమంలోనే ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణిస్తుందని జైశంకర్‌ తెలిపారు.

కాగా... ప్రస్తుతం జైశంకర్‌ నైజీరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అక్కడి పారిశ్రామికవేత్తలతో భారత్‌ - నైజీరియాల మధ్య సహాయసహకారాలపై చర్చించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రవాసులతో భేటీ అయిన ఆయన... డిజిటల్ చెల్లింపుల్లో భారత్ రికార్డును వెల్లడించారు.