Begin typing your search above and press return to search.

మేయర్ రిక్వస్ట్: దంప‌తులు క‌లిసి స్నానం చేయండి ప్లీజ్!

ఇప్పుడు నీరే అక్కడ అతిపెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2024 3:43 AM GMT
మేయర్  రిక్వస్ట్: దంప‌తులు క‌లిసి స్నానం చేయండి ప్లీజ్!
X

దంపతులు కలిసే స్నానం చేయాలని.. సెలవు రోజుల్లోనూ, బయటకు వెళ్లని రోజుల్లోనూ అసలు స్నానమే చేయొద్దని సరికొత్త రిక్వస్ట్ చేస్తున్నారు ఓ నగర మేయర్! దీంతో... ఇదేమి వింత రిక్వస్ట్ అని ముందు కాస్త సీరియస్ లుక్ ఇచ్చినవారు.. ఆ తర్వాత ఆయన ఆ మాటలు చెప్పడానికి గల కారణాలు, ఆ పరిస్థితులను తెలుసుకుని కాస్త అర్ధంచేసుకున్నట్లుగా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. ఇంతకూ సదరు నగర మేయర్ ఈ రిక్వస్ట్ ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు చూద్దాం!!

అవును... దంపతులు కలిసి స్నానం చేయాలని.. సెలవు దినాల్లోనూ, బయటకు వెళ్లని రోజుల్లోనూ అసలు స్నానమే చేయొద్దని నగర మేయర్ చెప్పడానికి గల అసలు కారణం విపరీతమైన నీటి ఎద్దడి అట! ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో నీటి కటకట ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని వెల్లడిపరుస్తూ పలు విషయాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నీరే అక్కడ అతిపెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు.

ఇప్పటికే మ‌న దేశంలోని బెంగ‌ళూరు న‌గ‌రంలోని ప్రజ‌లకు నీటి క‌ష్టాలు మొద‌లైపోయిన సంగతి తెలిసిందే. ఇక్కడ గార్డెనింగ్ కోసం మంచి నీరు వాడినా, కార్లు క‌డిగినా జ‌రిమానాల‌ను విధిస్తున్నారు అధికారులు. ఈ జాబితాలో మరికొన్ని నగరాలు చేరబోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో కొలంబియా దేశ రాజ‌ధాని బొగోటా నగరంలో కూడా ప్రజ‌ల‌కు నీటి క‌ష్టాలు మొద‌లు అయ్యాయట. ఎన్నడూ లేని క‌నిష్ట స్థాయికి రిజ‌ర్వాయ‌ర్ల నీటి మ‌ట్టాలు చేరుకున్నాయట.

ఈ సమయంలోనే రంగంలోకి దిగిన బొగోటా మేయర్‌ కార్లోస్‌ ఫెర్నాండో గలాన్... నీటిని పొదుపు చేసేందుకు నగరవాసులకు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారట. ఇందులో భాగంగానే... దంప‌తులు క‌లిసి స్నానం చేయాల‌ని ఆయన సూచించాడు. అందువల్ల నీరు ఎక్కువ‌ ఖర్చవ్వదని.. ఆదా అవుతుంద‌ని వివరణ కూడా ఇస్తున్నారు. ఇదే సమయంలో... ఆదివారం లేదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లని రోజున స్నానం చేయ‌డం మానుకోవాల‌ని ప్రజ‌ల‌కు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం నగరంలో అతిపెద్ద సమస్యగా ఉన్న నీటి ఎద్దడి నేపథ్యంలో ఒక్క బొట్టు నీటిని వృథా చేయొద్దనీ, ఇలాంటి జాగ్రత్తలను ఇంకా ఎన్నో తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. ప్రజలంతా ఈ విషయంలో ఎవరి స్థాయిలో వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారని తెలుస్తుంది. ఇందుకు ప్రధాన కారణం... బొగొటా నీటి అవ‌స‌రాల‌ను 70 శాతానికి పైగా తీర్చే చింగాజా నీటి వ్యవ‌స్థకు ప్రాణాధార‌మైన మూడు రిజ‌ర్వాయ‌ర్లలో కేవ‌లం 16.9 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయంట.