Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని..విపక్షాన్ని కార్నర్ చేసిన జగన్ ...!

తనకు విశాఖ మీద ఉన్న చిత్తశుద్ధి చాలా గొప్పదని జగన్ అంటున్నారు. తాను గత అయిదేళ్లలో విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను అని ఆయన చెప్పారు.

By:  Tupaki Desk   |   5 March 2024 11:39 AM GMT
విశాఖ రాజధాని..విపక్షాన్ని కార్నర్ చేసిన  జగన్ ...!
X

విశాఖ రాజధాని అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ నడిబొడ్డున గంభీరమైన ప్రకటన చేసారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్ లో నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ కి ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ గురించి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కి ధీటైన రాజధాని అంటే అది విశాఖ మాత్రమే అని కూడా స్పష్టం చేశారు.

తనకు విశాఖ మీద ఉన్న చిత్తశుద్ధి చాలా గొప్పదని జగన్ అంటున్నారు. తాను గత అయిదేళ్లలో విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను అని ఆయన చెప్పారు. అయితే విపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేశాయని, అబద్ధాలు ఆడి మరీ విశాఖ ప్రగతిని అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు

కోర్టులలో కేసులు వేశారని విశాఖలో భూ కబ్జాలు అంటూ విశాఖ మీద విషం కక్కాయని జగన్ చెప్పారు. ఆఖరుకు సీఎం విశాఖకు రాకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖను ఎవరేమి అన్నా అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే విశాఖ పరిపాలనా రాజధానిగా చేసుకుంటామని తాను రెండవసారి గెలిచిన వెంటనే విశాఖ నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని జగన్ భారీ ప్రకటన చేశారు. విశాఖలోనే తన నివాసం అని ఆయన చెప్పేశారు.

విశాఖ ఏపీకి ఆర్ధికంగా గ్రోత్ ఇంజన్ అని ఆయన అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాలు అపూర్వం అన్నారు. బెంగళూరు కంటే విశాఖలో ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయని కితాబు ఇచ్చారు. విశాఖలో ప్రభుత్వం స్టేట్ సెక్రటేరియట్ ని నిర్మిస్తుందని ఆయన చెప్పారు. ఐకాన్ సెక్రటేరియట్ దేశానికే తలమానికంగా ఉంటుందని ఆయన చెప్పారు.

విశాఖను స్వార్ధ ప్రయోజనాల కోసం ఎవరు ఎదనీయకుండా చేసినా ఊరుకోను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని ఆయన అన్నారు. విశాఖను రాజధానిగా చేసుకోవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుందని రెడీ మేడ్ సిటీగా ఏపీకి విశాఖ ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు.

తనకు అమరావతి మీద ఏ మాత్రం కోపం లేదని అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే మరో ఇరవై ఏళ్ళు పడుతుందని, అంతే కాదు పదిహేను లక్షల కోట్లు అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని ఆయన అంటున్నారు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విశాఖలో తమ ప్రభుత్వం అద్భుతమైన స్టేడియం ని నిర్మించిందని భోగాపురం లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో కనెక్టివిటీ పెంచిందని ఆయన గుర్తు చేశారు. విభజనతో కోల్పోయిన రాజధానిని విశాఖ ద్వారా సాధించుకోవచ్చు అని జగన్ అంటున్నారు

ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ మరో వారంలో రాబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన రాజకీయంగా కూడా చర్చకు దారి తీస్తోంది. ఈసారి విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల సీట్లు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం. విశాఖ సిటీలో గతంలో వైసీపీ గెలవలేదు. ఈసారి విశాఖ సిటీతో పాటు అన్ని చోట్లా గెలవాలని చూస్తోంది.

అందులో భాగంగానే ఉత్తరాంధ్రా ముఖ ద్వారం అయిన విశాఖను రాజధానిగా చేస్తామని మరోమారు సీఎం గట్టిగా చెప్పారు అని అంటున్నారు. అదే టైం లో ఏపీకి రాజధాని ఏదీ అని అడిగే విపక్షాలకు సరైన సమాధానంగా విశాఖ అని వైసీపీ చెప్పింది అని అంటున్నారు. విశాఖను ఎపుడో రాజధానిగా ప్రకటించేవారమని అడ్డుకుంటోంది విపక్షమే అని కూడా చెప్పేందుకే ఈ ప్రకటన అంటున్నారు.

ఇక విశాఖ రాజధాని పేరుతో వైసీపీ ఈసారి ఎన్నికలను ఎదుర్కోబోతోంది అని అంటున్నారు. ఇపుడు విపక్షాలు కార్నర్ అవుతున్నాయని అంటున్నారు. విశాఖకు పాలనా రాజధానిని తెస్తామని వైసీపీ చెబుతున్న దానికి ధీటైన ప్రకటన విపక్షాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. విపక్షం అంతా అమరావతినే రాజధాని అంటున్నాయి. దాంతో సోలోగా ఉత్తరాంద్ర్హా లో రాజకీయ ఆధిపత్యాన్ని సాధించడానికి పై చేయి కావడానికి వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా వైజాగ్ రాజధాని అని ప్రకటించారు అంటున్నారు.

ఇక విశాఖ రాజధాని అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రకటించారు. అందులో ఏ మార్పు లేదని ఆయన అంటున్నారు. సీఎం జగన్ చెప్పిన దాన్ని విజయసాయిరెడ్డి సమర్ధించారు. ఏది ఏమైనా విశాఖలో ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనకు విపక్షం ఎలా కౌంటర్ చేస్తుంది అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.