Begin typing your search above and press return to search.

77 ఏళ్ల స్వ‌తంత్ర దేశంలో తొలిసారి ఇండ‌జ‌న‌స్ రాగం.. ఏంటిది?

దేశానికి స్వ‌తంత్రం సిద్ధించిన 77 ఏళ్ల‌లో తొలిసారి స్వ‌దేశీ ప్ర‌యోజ‌నాల‌కు పూర్తిస్థాయిలో పెద్ద‌పీట వేసిన ఏకైక బ‌డ్జెట్‌గా తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్ నిలిచింద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

By:  Garuda Media   |   2 Feb 2026 6:00 PM IST
77 ఏళ్ల స్వ‌తంత్ర దేశంలో తొలిసారి ఇండ‌జ‌న‌స్ రాగం.. ఏంటిది?
X

దేశానికి స్వ‌తంత్రం సిద్ధించిన 77 ఏళ్ల‌లో తొలిసారి స్వ‌దేశీ ప్ర‌యోజ‌నాల‌కు పూర్తిస్థాయిలో పెద్ద‌పీట వేసిన ఏకైక బ‌డ్జెట్‌గా తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్ నిలిచింద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గ‌త 76 సంవ‌త్స‌రాలుగా.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ తీరుతెన్నులు గ‌మ‌నిస్తే.. రాష్ట్రాల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు.. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు అనేక ప్ర‌య‌త్నాలు సాగాయి.

త‌ద్వారా మూల ధ‌న వ్య‌యం.. అంటే... ఆదాయం వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌లు, రంగాల‌కు.. భారీ ప్రోత్స‌హ‌కాల‌ను ఇవ్వ‌కుండా.. ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాల‌కు పెద్ద‌పీట వేశారు. అనేక ప‌థ‌కాల‌తోపాటు.. ఆయా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు కేటాయింపులు పెంచుతూ పోయారు. ఈ క్ర‌మంలోనే ఈ ద‌ఫా ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఉండ‌డంతో ఆయా రాష్ట్రాల మెప్పు కోసం.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్లో విన్యాసాలు ఉంటాయ‌ని ముందుగా అంచ‌నా వేసుకున్నారు.

కానీ, అంత‌ర్జాతీయ ప‌రిణామాలు, ముఖ్యంగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చూపిస్తున్న సుంకాల ప్ర‌భావం వంటివి దేశంపై బ‌లంగా క‌నిపిస్తున్నాయి. జైళి, ఆక్వా, ఐటీ రంగాల‌కు ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వీటిని ముందుగా అంచ‌నా వేయ‌లేని దేశాలు.. ఇప్పుడు ఇరుకున ప‌డుతున్నాయి. నేప‌థ్యంలో కేంద్రం ఈ విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేసింది. ఇదేస‌మ యంలో వృత్తి విద్య‌, చిన్న‌, సూక్ష్మ, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.

ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ఇబ్బందిగా ఉన్న విదేశీ మారక ద్ర‌వ్యాన్ని పెంచుకునేందుకు వార‌స‌త్వ ప‌ర్యాట‌క ప్రాంతాలు, ప్ర‌ధానంగా ప్ర‌పంచ దేశాల నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు బౌద్ధ ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌, మూల ధ‌న వ్య‌యాన్ని 1 శాతం పెంచ‌డం ద్వారా..(11.2 శాతం నుంచి 12.2 శాతానికి పెంచి) రాబ‌డి మార్గాల‌ను వెతుక్కుంది. ఇలా మూల ధ‌న వ్య‌యం పెరిగిన ఇటీవ‌ల బ‌డ్జెట్‌లలో ఇదే తొలిద‌ని.. త‌ద్వారా దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.