Begin typing your search above and press return to search.

టీడీపీలో హాట్ టాపిక్... ఆ సీనియర్స్ కి ఈసారి సారీ యేనా?

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:04 PM GMT
టీడీపీలో హాట్ టాపిక్... ఆ సీనియర్స్ కి ఈసారి సారీ యేనా?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో రసవత్తర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ వేడిని మరింత పెంచే క్రమంలో టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. ఇందులో భాగంగా... 94 సీట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు తన అభ్యర్థులను ప్రకటించారు. 175 లోనూ 24 సీట్లు జనసేనకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమయంలో ఫస్ట్ లిస్ట్ లో మిస్సయిన సీనియర్స్ లిస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... టీడీపీలో కీలక నేతలుగా ఉన్న కొంతమంది సీనియర్ నేతలు, మాజీ మంత్రుల పేర్లు ప్రకటించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి ఇప్పుడు ప్రకటించిన 94 పేర్లలో... మెజారిటీ స్థానాల్లో ఎప్పటి నుంచో వింటున్న పేర్లే ఉండగా... అదే సమయంలో అంతకు మించిన సీనియర్లు ఉన్న నియోజకవర్గాలు, ఆ సీనియర్ల పేర్లు ఫస్ట్ లిస్ట్ లో మిస్సవ్వడం ఆసక్తిగా మారింది. దీంతో... లాస్ట్ లిస్ట్ లోనూ మిస్సవ్వదు కదా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి!

ఇందులో భాగంగా ఏపీ టీడీపీ మాజీ చీఫ్ కిమిడి కళావెంకట్రావు పేరు తొలిజాబితాలో లేకపోవడం ఆసక్తిగా మారింది. ఎచ్చర్ల నుంచి ఈసారి కూడా కళా వెంకట్రావు పోటీ ఉంటుందని తమ్ముళ్లు భావిస్తున్న నేపథ్యంలో బాబు నుంచి చిన్న సైజు షాక్ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు తనకు దేవుడు అంటూ ప్రచారం చేసుకునే బుద్దా వెంకన్న పేరు కూడా ఫస్ట్ లిస్ట్ లో వినిపించలేదు. ఈయన విజయవాడ వెస్ట్ పై మనసుపడ్డారని.. అక్కడ నుంచి పోటీకి బలంగా ఫిక్సయ్యారని అంటున్నారు.

ఇక్కడ విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ ప్రకటించిన చంద్రబాబు విజయవాడ వెస్ట్ ని మాత్రం హోల్డ్ లో పెట్టారు. ఇదే క్రమంలో గతకొన్ని రోజులుగా వార్తల్లో బలంగా నానుతున్న బుచ్చయ్య చౌదరి పేరు కూడా బాబు పలకలేదు. రాజమండ్రి రూరల్ ప్రస్థావన తొలిజాబితాలో లేకపోవడంతో ఆ సీటుపై సస్పెన్స్ మరింతకాలం తప్పకపోవచ్చు! ఇక పీతల సుజాత, యరపైనేణి శ్రీనివాస్ లతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా తొలిజాబితాలో లేకపోవడం గమనార్హం.

ఇదే సమయంలో చంద్రబాబుకు నమ్మిన బంటులు, వీర విధేయులు అని వినిపించే పేర్లలో మాజీమంత్రి దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్ ల పేర్లు కూడా తొలిజాబితాలో వినిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2009, 2014ల్లో వరుసగా గెలవడంతో పాటు గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ పేరు, మైలవరం ప్రస్థావన తొలిజాబితాలో లేదు. దీంతో... ఈసారి ఉమకు చంద్రబాబు షాక్ ఇవ్వబోతున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇక మంచో చెడో నిత్యం వార్తల్లో నిలిచే టీడీపీ కీలక నేతల్లో ఒకరైన చింతనేని ప్రభాకర్ పేరు కూడా తొలిజాబితాలో లేదు. దీంతో దెందులూరు కూడా జనసేన ఖాతాలో అంటూ గతకొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగాణాలకు బలం చేకూరిందని ఒకరంటే... ఆ టిక్కెట్ ఒక లాయర్ ఎగరేసుకుపోటున్నారని మరొకరు అంటున్నారు!

ఏది ఏమైనా... తొలిజాబితాలో ఇలాంటి కీలకమైన వ్యక్తుల ప్రాస్థావన లేకపోవడం కచ్చితంగా చర్చనీయాంశమే కాగా... తుది జాబితాలో అయినా వీరి పేర్లు ఉంటాయా.. లేకపోతే ఈసారి సారీ అంటారా అనేది వేచి చూడాలి!