Begin typing your search above and press return to search.

నమ్మలేరు కానీ నిజం.. అతడి ఏడాది జీతం రూ.7400కోట్లు

అయితే.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారి జీతం ఎంత ఉండొచ్చన్న విషయానికి వచ్చినప్పుడు.. ఎంతన్నది అంచనా వేయలేని విధంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 4:29 AM GMT
నమ్మలేరు కానీ నిజం.. అతడి ఏడాది జీతం రూ.7400కోట్లు
X

కొత్తగా కలిసిన వారితో మాట కలిపిన కాసేపటి తర్వాత జీతం ఎంతన్న మాట ఇట్టే వచ్చేస్తుంది. మారిన కాలానికి తగ్గట్లు మాటలో మార్పు వచ్చి.. ‘ప్యాకేజ్ ఎంత బ్రో’ అంటూ మాట్లాడుకున్నా.. అంతిమంగా నెలకు వచ్చే జీతం రాళ్ల సంగతి గురించి తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. అయితే.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారి జీతం ఎంత ఉండొచ్చన్న విషయానికి వచ్చినప్పుడు.. ఎంతన్నది అంచనా వేయలేని విధంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే పెద్ద మనిషి జీతం గురించి అయితే.. అత్యుత్తమ స్థాయిలో ఉన్న వారు సైతం అంచనా కట్టలేనంత భారీగా ఉంటుందన్న విషయం తాజాగా రివీల్ అయ్యింది.


అమెరికాకు చెందిన ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ కంపెనీ బ్లాక్ స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అదేనండి సీఈవో)గా వ్యవహరిస్తున్నారు స్టీవ్ స్మార్జ్ మాన్. ఆయన శాలరీ గురించి తెలిస్తే నోట మాట రాదంతే. గత ఏడాది ఆయన అందుకున్న జీతం 896.7 మిలియన్ డాలర్లు. మన రూపాయిల లెక్కల్లో చూస్తే.. రూ.7400 కోట్లు. మరింత షాకింగ్ నిజం ఏమంటే.. అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే ఈ జీతం 30 శాతం తగ్గిందట. అయితే.. ఫైనాన్స్ రంగంలో అతి పెద్ద వార్షిక చెల్లింపుల్లో ఇదొకటిగా చెబుతున్నారు.

77 ఏళ్ల స్క్వార్జ్ మాన్ తాను పని చేస్తున్న కంపెనీలో సుమారు 20 శాతం వాటా ఉంది. దానికి సంబంధించిన డివిడెండ్ల రూపంలోనే రూ.6400 కోట్లను అందుకున్నట్లు చెబుతున్నారు. మరో రూ.990 కోట్ల మొత్తాన్ని ప్రోత్సాహక రుసుములు.. క్యారీడ్ వడ్డీగా పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారని చెబుతున్నారు.. ఆయనకు వచ్చే ఆదాయంతో ఆయన్ను ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా చెబుతారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తుల లెక్క ఎంతో తెలుసా? జస్ట్ రూ.3.4 లక్షల కోట్లు మాత్రమే.