Begin typing your search above and press return to search.

అంతకంతకూ పెరుగుతున్న అభ్యర్థులు.. ఎంపీ ఎన్నికల సీన్ సిత్రం

1952లో లోక్ సభకు సగటున 4.67 మంది అభ్యర్థులు పోటీచేయగా.. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 14.8కి చేరింది

By:  Tupaki Desk   |   2 March 2024 4:58 AM GMT
అంతకంతకూ పెరుగుతున్న అభ్యర్థులు.. ఎంపీ ఎన్నికల సీన్ సిత్రం
X

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే వర్తమానంలో ఇది మరింత ఎక్కువ అవుతోంది. దశాబ్దాల క్రితం వేళ్ల మీద లెక్కేసే స్థాయిలో అభ్యర్థులు బరిలో ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. తాజాగా ఒక ఎన్జీవో ఆసక్తికర కసరత్తు చేసింది.. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్ సభ ఎన్నికల అంశాలపై అధ్యయనం చేసింది. దీనిపై ఆసక్తికర అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చింది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి అనే ఎన్జీవో చేపట్టిన ఈ రీసెర్చ్ వివరాల్లోకి వెళితే..

1952లో లోక్ సభకు సగటున 4.67 మంది అభ్యర్థులు పోటీచేయగా.. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 14.8కి చేరింది. 1952లో జరిగిన ఎన్నికల్లో 489 స్థానాలకు 1874 మంది అభ్యర్థులు పోటీ చేస్తే.. 2019 నాటికి వారి సంఖ్య 8039కు చేరింది. అయితే.. 1952లో 489 ఎంపీ స్థానాలు 2019 నాటికి 542గా మారాయి. 1977 వరకు లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య సరాసరి మూడు మాత్రమే ఉన్నట్లుగా పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరిగారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. 2019లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఏకంగా 185 మంది పోటీ చేయటం.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేయగా.. ఆమెపై పసుపు రైతులు భారీ సంఖ్యలో బరిలోకి దిగటం దేశ వ్యాప్తంగా అందరి చూపు పడేలా చేసింది. ఈ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కాగా.. ఈ సీటును బీజేపీ సొంతం చేసుకోవటం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్యలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా.. తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో సగటు అభ్యర్థుల సంఖ్య 16.1 గా ఉండగా.. తమిళనాడులో ఎక్కువ మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో నిలిచారు. నిజామాబాద్ తర్వాత ఎక్కువమంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గంగా కర్ణాటకలోని బెల్గాంగా నిలిచింది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. అత్యధిక అభ్యర్థులు పోటీ చేసిన టాప్ 5 లోక్ సభ స్థానాలు తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక నుంచే ఉన్నాయి. 2019లో బీజేపీ 435 స్థానాల్లో.. కాంగ్రెస్ 420 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు పార్టీల మధ్య పోరు 373 స్థానాల్లో చోటు చేసుకుంది. బీఎస్పీ నుంచి మూడో అత్యధిక అభ్యర్థులు పోటీలో ఉన్న పార్టీగా నిలిచింది. ఏడు జాతీయ పార్టీలు సగటున 2.69 మంది అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు దేశ వ్యాప్తంగా 1.53 చొప్పున అభ్యర్థుల్ని పోటీలో నిలిపినట్లుగా తేల్చారు.