క్యాన్సర్ రైలు వెనక దాగిన కన్నీటి కథ
స్థానికంగా సరైన క్యాన్సర్ చికిత్స సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు రోజూ ఈ రైలు ఎక్కి బికనీర్ లోని భారీ ఆసుపత్రుల వరకూ వెళ్లాల్సి వస్తోంది.
By: Tupaki Desk | 21 Jun 2025 11:00 PM ISTఒక ఊరు నుండి మరో ఊరు వరకు వెళ్లే సాధారణ రైలు అనిపించొచ్చు. కానీ పంజాబ్ నుంచి రాజస్థాన్ వెళ్లే ఈ ప్రత్యేక రైలు వెనక ఉంది ఓ బాధాకర కన్నీటి కథ. ఇది “క్యాన్సర్ రైలు”గా దేశవ్యాప్తంగా పేరుపొందింది.
పంజాబ్‌లోని బటిండా నుండి రాజస్థాన్‌లోని బికనీర్ వరకు రోజూ నడిచే ఈ ప్యాసింజర్ రైలు... సాధారణ ప్రయాణికుల కన్నా ఎక్కువగా క్యాన్సర్ రోగులను మోస్తోంది. ఇది ప్రతి రోజు రాత్రి 9:20 గంటలకు బటిండా నుంచి బయలుదేరి, బికనీర్‌లోని ఆసుపత్రులకు చికిత్స పొందేందుకు వెళ్లే రోగులను తీసుకెళ్తుంది.
ఈ దుర్భాగ్య పరిస్థితికి కారణం పంజాబ్‌లోని మల్వా ప్రాంతం. వ్యవసాయంలో అధికంగా ఉపయోగించే విషపూరిత రసాయనాలు, ఎరువులు, పెస్టిసైడ్లు అక్కడి భూమిని, నీటిని, ఆహారాన్ని కలుషితం చేశాయి. దీని ప్రభావం స్థానిక ప్రజల ఆరోగ్యం మీద బలంగా పడింది. దీనివల్ల క్యాన్సర్ కేసులు ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా పెరిగాయి. ఈ ప్రాంతాన్ని "క్యాన్సర్ బెల్ట్" అని కూడా పిలుస్తున్నారు.
స్థానికంగా సరైన క్యాన్సర్ చికిత్స సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడి ప్రజలు రోజూ ఈ రైలు ఎక్కి బికనీర్ లోని భారీ ఆసుపత్రుల వరకూ వెళ్లాల్సి వస్తోంది. కేవలం రోగులు మాత్రమే కాదు, వారి తోడు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రయాణంలో భాగమవుతారు. ఈ రైలు కొన్ని గంటల ప్రయాణం కానీ... దానిలో నిండిపోయే బాధలు, ఆవేదనలు మాత్రం అపారంగా ఉంటాయి.
ఈ ప్రత్యేకమైన రైలు భారత వ్యవసాయ విధానాల, ఆరోగ్య సంరక్షణ రంగాల వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని నియంత్రించకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేశంలో అభివృద్ధి, స్వచ్ఛత, ఆరోగ్యం కోసం అనేక ప్రకటనలు జరుగుతున్నప్పటికీ... ఈ క్యాన్సర్ రైలు రోజూ నడుస్తూ ఇలాంటి మౌన రోదనలకు సాక్ష్యంగా నిలుస్తోంది.
ఇలాంటి పరిస్థితులు ఇకనైనా మారాలి. వ్యవసాయ విధానాల్లో సుస్థిరత, ఆరోగ్య సంరక్షణ సేవల విస్తరణ, గ్రామీణ ప్రాంతాల్లో అనువైన వైద్య సదుపాయాల ఏర్పాటు అత్యవసరం. లేదంటే, “క్యాన్సర్ రైలు” నామమాత్రం కాదుగా... గ్రామాల నిస్సహాయతకు ప్రతీకగా మారిపోతుంది.
