Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ చెప్పిన కెనడా... సూపర్ వీసాతో ఫ్యామిలీ ఫ్యామిలీ...!

అవును... కెనడాలో నివాసం ఉంటున్న భారత పౌరులకు ఊరట కల్పించేలా అక్కడి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 2:52 PM GMT
గుడ్  న్యూస్  చెప్పిన కెనడా... సూపర్  వీసాతో ఫ్యామిలీ ఫ్యామిలీ...!
X

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌ కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. కెనడాలో వీసా సర్వీసులను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొన్నాయి. మరోపక్క కెనడా మాత్రం సూపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది.

అవును... కెనడాలో నివాసం ఉంటున్న భారత పౌరులకు ఊరట కల్పించేలా అక్కడి ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అక్కడున్న ఇండియన్స్.. తమ తల్లిదండ్రులతో మరింత కాలం గడిపేందుకు "సూపర్" వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో ఎక్కువ కాలం పాటు తమతో పాటే కెనడాలో నివాసం ఉండేలా సూపర్‌ వీసా నిబంధనలన సులభతరం చేసింది.

వాస్తవానికి... కెనడా పౌరులు, ఇప్పటికే కెనడాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న ఇతర దేశస్తుల వ్యక్తులు... తమ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ని తాత్కాలికంగా నివసించేందుకు ఉద్దేశించిన వీసానే ఈ సూపర్‌ వీసా. అయితే గతంలో ఈవీసాతో ఒకసారి ప్రవేశానికి 2 ఏళ్లు మాత్రమే గరిష్ఠంగా నివాసం ఉండేందుకు వీలుండేది.

ఆ తర్వాత కాలంలో రెండేళ్లంటే మరీ స్వల్ప వ్యవధి అని భావించారో ఏమో కానీ... కాల క్రమేణా దాన్ని ఐదేళ్లకు పెంచారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి మరికొన్నేళ్లు పెంచారు. ఇందులో భాగంగా.. ఈ వీసాతో 10 ఏళ్ల పాటు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తమ పిల్లలు, మనవళ్లతో కెనడాలో నివాసం ఉండొచ్చు. అంతేకాదు.. అనేకసార్లు వచ్చీ వెళ్లొచ్చు కూడా.

ఈ మేరకు... ఇమ్మిగ్రేషన్, ప్రజా భద్రత శాఖ, శరణార్థులు పౌరసత్వ మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

కాగా... సాధారణంగా విజిటర్‌ వీసా మీద కెనడా వెళ్తే... గరిష్ఠంగా ఆరు నెలలు మాత్రమే నివాసం ఉండేందుకు వీలుంటుందనేది తెలిసిన విషయమే. కావాలంటే ఆ తర్వాత పొడిగించుకోవచ్చు కానీ... దానికోసం మళ్లీ ఫీజులు, ప్రాసెస్ మొదలైన వ్యవహారాలుంటాయి. అయితే అలాంటి తలపోట్లేమీ లేకుండా సుదీర్ఘకాలం పాటు ఉండటానికి ఈ సూపర్‌ వీసా ఉపయోగపడుతుంది.

అలా అని ఎవరు బడితే వాళ్లు వాళ్ల వాళ్ల పేరెంట్స్ ని, గ్రాండ్ పేరెంట్స్ ని, తమ లైఫ్ పార్ట్నర్ పేరెంట్స్ ని తీసుకుతెచ్చుకుని ఉండలేరు సుమా. వారిని ఎవరైతే కెనడాకు ఆహ్వానిస్తున్నారో ఆ వ్యక్తి... కొత్తగా వస్తున్న వ్యక్తుల కనీస అవసరాలను తీర్చగలిగే ఆర్థిక సామర్థ్యం ఉందని ఆదాయ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.