Begin typing your search above and press return to search.

జీ-20 సదస్సు: కెనడా ప్రధాని చేసిన అల్లర అంతా ఇంతా కాదు?

ఇవన్నీ మనసులో పెట్టుకుని తప్పక వచ్చారో ఏమో కానీ... జీ20 సదస్సులో భాగంగా భారత్‌ కు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వింతగా ప్రవర్తించారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 1:15 PM GMT
జీ-20 సదస్సు: కెనడా ప్రధాని చేసిన అల్లర అంతా ఇంతా కాదు?
X

ఈదఫా జీ-20 సదస్సుకు భారతదేశం వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ సదస్సుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భారతీయ ఆతిథ్యాలను, కళాకండాలను, సంస్కృతి, సంప్రదాయాలను రుచి చూసే, చవి చూసే అవకాశం పలు దేశాల అధినేతలకు అందించారు. ఈ సమయంలో కెనడా ప్రధాని మాత్రం కొన్ని విషయాలను తిరస్కరించారని తెలుస్తుంది.

ప్రస్తుతం కెనడా- భారత్‌ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఖలిస్థానీ అంశంపై భారత్‌ ఆందోళనలను కెనడా పట్టించుకోకుండా... అసంబద్ధంగా భారత్ పై నిందలేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇందులో భాగంగ... ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌ దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవన్నీ మనసులో పెట్టుకుని తప్పక వచ్చారో ఏమో కానీ... జీ20 సదస్సులో భాగంగా భారత్‌ కు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వింతగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌ లో ఉండేందుకు నిరాకరించారట. దీనిపై అప్పట్లో భారత నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయని చెబుతున్నారు.

అవును... జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్‌ కు వచ్చిన నేపథ్యంలో వారందరి విడిది కోసం ఢిల్లీలోని 30 ప్రముఖ హెటళ్లలో గదులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మరి ముఖ్యంగా దేశాధ్యక్షులు, ప్రధానుల కోసం భద్రతా వర్గాల సూచనల మేరకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ లను సిద్ధం చేశారు.

ఈ క్రమంలోనే కెనడా ప్రధాని కోసం ఢిల్లీలోని "ది లలిత్‌" హోటల్‌ లో ప్రెసిడెన్షియల్‌ సూట్‌ ను భారత ప్రభుత్వం బుక్‌ చేసింది. అయితే ఊహించని రీతిలో అందులో ఉండేందుకు ట్రూడో నిరాకరించారు. దానికి బదులుగా సాధారణ గదిలో బస చేశారని తెలుస్తుంది! ఇదే క్రమంలో... సదస్సు ముగిసిన తర్వాత కూడా ఆయన ఆలస్యంగా స్వదేశానికి బయల్దేరారు.

వాస్తవానికి సదస్సు అయిన అనంతరం ఆయన సెప్టెంబరు 10న భారత్‌ నుంచి బయల్దేరాల్సి ఉండగా... విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని ఆగిపోయారు. దీంతో భారత ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా వన్‌ ను ఆఫర్‌ చేసినప్పటికీ.. అది బాగయ్యాక తమ విమానంలో తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపించారు!

మరోపక్క భారత భద్రతా వర్గాల సూచనల మేరకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఐటీసీ మౌర్య షెరటాన్‌ లో, చైనా ప్రధాని లీ చియాంగ్‌.. తాజ్‌ ప్యాలెస్‌ లో బస చేశారు.

కాగా... ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాకిస్తాన్, యూకే దేశాల్లో కూడా పలువురు ఖలిస్తానీ నేతలు చంపబడ్డారు. అయితే వీటన్నింటి వెనక భారత గూఢచార సంస్థ (రా) ఉందని పలువురు ఖలిస్తానీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించగా.. ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఏకంగా భారత దౌత్యవేత్తనే బహిష్కరించే స్థాయికి వెళ్లింది.