Begin typing your search above and press return to search.

మళ్లీ గిల్లుతున్న కెనడా.. భారత్ పై సరికొత్త ఆరోపణలు!

అవును... కెనడా - భారత్ మధ్య ఏర్పడిన దౌత్యపరమైన విభేదాలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Jan 2024 10:22 AM GMT
మళ్లీ గిల్లుతున్న కెనడా.. భారత్  పై సరికొత్త ఆరోపణలు!
X

గతకొంతకాలంగా ఇండియా - కెనడా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఇండియన్ ఏజెంట్సే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలను రాజేశాయి. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. అయితే గత కొంతకాలంగా ఈ వ్యవహారం కాస్త సైలంట్ గా ఉన్నట్లే కనిపించింది. అయితే తాజాగా మరోసారి ట్రూడో ప్రభుత్వం భారత్ విషయంలో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

అవును... కెనడా - భారత్ మధ్య ఏర్పడిన దౌత్యపరమైన విభేదాలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని చేసిన నిరాధార ఆరోపణలు అప్పట్లో తీవ్ర వివాదం అయ్యాయి. ఈ సమయంలో మరోసారి ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి! తాజా వ్యవహారం భారత్ ను రెచ్చగొడుతున్నట్లుగా ఉన్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తాజాగా ట్రూడో ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్‌ పేరును కూడా చేర్చింది. దీంతో... ఉన్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

గత సెప్టెంబర్‌ లో ట్రూడో ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే... తాజాగా భారత్‌ పేరును ఆ దర్యాప్తులో చేర్చింది. ఇదే సమయంలో... చైనా, భారత్‌ తో పాటు రష్యా వంటి దేశాలపైనా కెనడా ఈ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇండిపెండెంట్ కమిషన్ తమ మధ్యంతర నివేదికను మే 3వ తేదీ నాటికి.. పూర్తిస్థాయి నివేదిక ఈ ఏడాది చివరికల్లా ఇవ్వనుందని తెలుస్తుంది.

కాగా... గతేడాది జూన్‌ లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు హీటెక్కాయి. వాటిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ సమయంలో మరోసారి కెనడా... కవ్వింపు చర్యలకు పాల్పడినట్ట్లుగా ప్రవర్తించింది!