కెనడా చరిత్రలోనే అత్యంత ఘోరమైన కార్చిచ్చు.. కాలి బూడిదైన 15 లక్షల ఎకరాలు
కెనడా దేశం ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భీకర కార్చిచ్చులతో అల్లాడుతోంది.
By: Tupaki Desk | 30 May 2025 3:47 PM ISTకెనడా దేశం ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భీకర కార్చిచ్చులతో అల్లాడుతోంది. పశ్చిమాన సస్కెట్చివాన్ ప్రావిన్స్‌లో కార్చిచ్చు తీవ్రంగా వ్యాపించడంతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పటికే మాంటోబా ప్రావిన్స్‌లో దీని కారణంగా వేలాది మంది ప్రజలను వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చులు కేవలం కెనడాకే పరిమితం కాకుండా, పొగ రూపంలో సరిహద్దులు దాటి అమెరికాలోని పలు రాష్ట్రాల ప్రజలనూ శ్వాసకోశ సమస్యలకు గురిచేస్తున్నాయి.
సస్కట్చెవాన్ ప్రావిన్స్ ప్రీమియర్ స్కాట్‌మో మాట్లాడుతూ.. తమ ప్రావిన్స్ తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని, విపత్తును ఎదుర్కోవడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపారు. ఇక్కడ ఇప్పటికే 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని కీలలు అంచనాలకు మించి 6,69,000 ఎకరాల్లో విస్తరించి, భీకరంగా వ్యాపిస్తున్నాయి. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదని, రానున్న రోజుల్లో మరింత సంక్లిష్టంగా మారే అవకాశముందని అగ్నిమాపక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాంటోబా ప్రావిన్స్‌లో బుధవారం నుంచే అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. చిన్నచిన్న గ్రామాలు, వాడలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రావిన్స్‌లో ఇప్పటికే 1,73,000 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో కార్చిచ్చును తాము చూడలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలను సురక్షితంగా తరలించేందుకు కెనడా వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. రెండు లేదా మూడు రోజులు భారీ వర్షాలు పడితే గానీ ఈ కార్చిచ్చు అదుపులోకి రాదని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాకూ ముప్పు
కెనడాలోని ఈ రెండు ప్రావిన్సుల నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ పొరుగునున్న అమెరికా రాష్ట్రాలైన మిన్నెసోటా, మిషిగాన్ తదితర ప్రాంతాల వైపు వెళుతోంది. దీని కారణంగా అమెరికాలో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నట్లు ది అమెరికన్ లంగ్ అసోసియేషన్ 2025లో విడుదల చేసిన 'స్టేట్ ఆఫ్ ది ఎయిర్' నివేదిక పేర్కొంది. ఈ కార్చిచ్చులు కేవలం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికీ పెను సవాలుగా మారాయి.
కెనడా చరిత్రలో భారీ నష్టం
2025లో ఈ రెండు ప్రావిన్సుల్లోనే మొత్తం 15 లక్షల ఎకరాలకు పైగా భూమి కార్చిచ్చులకు ఆహుతయ్యాయి. కెనడా సహజ వనరుల విభాగం లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 6,000 కార్చిచ్చులు సంభవించగా, అవి 3.7 కోట్ల ఎకరాలను కాల్చివేశాయి. ఈ సంఖ్య కెనడా చరిత్రలోనే అత్యధిక నష్టంగా రికార్డుల్లో నిలిచింది. పర్యావరణ మార్పుల ప్రభావం, సుదీర్ఘ పొడి వాతావరణం ఈ కార్చిచ్చులకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
