Begin typing your search above and press return to search.

కెనడాలో జాత్యహంకారం దాడి.. టొరొంటోలో భారతీయుడిపై దాడి

ఒక భారతీయ వ్యక్తిపై కెనడియన్‌ వ్యక్తి చేసిన దాడికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

By:  Tupaki Desk   |   5 Nov 2025 2:05 PM IST
కెనడాలో జాత్యహంకారం దాడి.. టొరొంటోలో భారతీయుడిపై దాడి
X

అతిథులను గౌరవించడం (అతిథి దేవోభవ) అతిథిని దేవుడితో సమానంగా చూడడం కేవలం భారతీయులకే సాధ్యమనే మరో ఘటన రుజువు వేసింది. కెనడాలోని టోరంటోలో భారతీయుడిపై ఆ దేశ పౌరుడు దాడికి దిగడం అది కూడా మద్యం తాగి దాడి చేయడం కొంచెం అసహనానికి గురి చేసింది. ఈ ఘటన కెనడాలో భారతీయుల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. టొరొంటోలోని ఒక కేఫేలో జరిగిన దాడి ఘటన అక్కడి సమాజంలో పెరుగుతున్న జాత్యహంకార భావాలను మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ఒక భారతీయ వ్యక్తిపై కెనడియన్‌ వ్యక్తి చేసిన దాడికి సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

‘యాక్టింగ్ సుపీరియర్’ అంటూ దాడి

వైరల్‌ వీడియోలో టొరొంటో బ్లూ జేస్‌ జాకెట్‌ ధరించిన ఒక వ్యక్తి, ‘మొబైల్‌ ఆర్డర్‌ పిక్‌అప్‌’ కౌంటర్‌ వద్ద నిలుచున్న భారతీయుడిపై ఆకస్మికంగా దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా కోపంతో తన ఫోన్‌ను నేలపై విసిరేసిన కెనడియన్‌ వ్యక్తి దానిని భారతీయుడు తీసుకొని ఇవ్వబోయే సమయంలో ‘నువ్వు చాలా సూపీరియర్‌గా యాక్ట్ చేస్తున్నావు’ అంటూ కాలర్‌ పట్టుకుని తోసిపుచ్చాడు. ఆ భారతీయుడు ప్రశాంతంగా, ‘ఇలా చేస్తే నీకే సమస్య వస్తుంది’ అని హెచ్చరించాడు. అయినా దాడి మాత్రం ఆపలేదు. కేఫే సిబ్బంది జోక్యం చేసుకున్నాకే పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాడి చేసిన వ్యక్తిని చివరకు బయటకు తీసుకెళ్లారు.

ఇమిగ్రెంట్లకు రక్షణ కల్పించాలి..

ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నెటిజన్లు కెనడా ప్రభుత్వాన్ని ఇమిగ్రెంట్ల భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఇది ఒక వ్యక్తిపై దాడి కాదు

విదేశీ మూలాల వారిపై పెరుగుతున్న ద్వేష భావాలకు ప్రతిబింబం’ అని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కేవలం ఓ కేఫేలో జరిగిన ఘటన కాదు.. ఇది ఒక దేశంలో సహజీవన స్ఫూర్తి, ఎంత బలహీనమైందో చూపించే దృశ్యం.

ఎడ్మంటన్‌లో జరిగిన హత్య ఘటనకు దగ్గరగా

ఇటీవలే ఎడ్మంటన్‌లో మరో భారతీయుడు 55 ఏళ్ల అర్వీ సింగ్‌ సాగూ జాత్యాహంకార హింసకు బలయ్యాడు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని అడ్డుకున్నందుకే.. ఆ వ్యక్తి సాగూను వాహనంతో ఢీ కొట్టి పడగొట్టాడు. తలకు గాయమై, అయన ఐదు రోజుల తర్వాత ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ కేసులో కైల్‌ పాపిన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన పిల్లల కోసం.. అంత్యక్రియల ఖర్చుల కోసం సాగూ స్నేహితుడు విన్సెంట్‌ రామ్‌ ఫండ్‌ రైజర్‌ కూడా ప్రారంభించారు. ఇక టొరొంటో ఘటన నేపథ్యంలోనే రావడంతో, కెనడాలో ఇమిగ్రెంట్ల భద్రతపై ఆందోళన తీవ్రం అవుతోంది.

ప్రజాస్వామ్య దేశంలో ద్వేషానికి స్థలం లేదు

కెనడా ప్రపంచంలో బహుభాషా, బహుజాతి సామాజిక సమానత్వానికి ప్రతీకగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవలి ఘటనలు ఆ పేరును ప్రశ్నిస్తున్నాయి. వలస వచ్చినవారు కెనడా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తారు. అయినా వారిపై దాడులు.. దౌర్జన్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది కేవలం చట్ట సమస్య కాదు.. బలహీనమైన వ్యక్తిత్వాల సమస్య.

ప్రజాస్వామ్యం అంటే అందరికి సమాన హక్కులు, సమాన గౌరవం.

అక్కడ రంగు, భాష, జాతి ఆధారంగా భిన్నత్వం చూపడం దేశ ఆత్మను కించపరచడమే.

శాంతియుత దేశంగా గుర్తింపు దక్కించుకున్న కెనడా ఇప్పుడు సవాలు ఎదుర్కొంటోంది. ప్రతి ఇమిగ్రెంట్‌ సురక్షితంగా ఉంటేనే ఆ దేశం సత్యంగా బలంగా ఉంటుంది. ఒక కేఫెలో జరిగిన దాడి మనుషుల మధ్య దూరం పెంచింది. ఇప్పుడు ఆ దూరాన్ని తగ్గించాల్సిన బాధ్యత కెనడా సమాజానిదే.