లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడాలో ఉగ్రముద్ర.. అదే జరిగితే?
కెనడాలో క్రమక్రంగా బిష్ణోయ్ నేర సామ్రాజ్యం విస్తరిస్తోందని.. పౌరులను దోచుకోవడం, హత్యలకు పాల్పడడంలో వీరి పాత్ర ఉందని ఎంపీ ఫ్రాంక్ ఆరోపించారు.
By: Tupaki Desk | 12 Aug 2025 11:00 PM ISTకెనడా.. భారతీయులకు అమెరికా తర్వాత ఇప్పుడు రెండో గమ్యస్థానం. ఎందరో విద్యార్థులు అక్కడకు వెళ్లి చదువులు కొనసాగిస్తూ ఉద్యోగాలు సాధించి స్థిరనివాసం కూడా ఏర్పరచుకుంటున్నారు. ఇక కొన్నేళ్ల ముందుకెళ్తే కెనడా భారత సంతతి సిక్కులకు స్వర్గధామం. సిక్కులు అక్కడి రాజకీయాల్లోనూ ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. అయితే, ఖలిస్తాన్ డిమాండ్ నేపథ్యంలో కెనడాలో తరచూ కొందరు కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ అంశం భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలను ప్రభావితం చేసేవరకు వెళ్లడం గమనార్హం.
సంబంధాలు మెరుగుపడుతుండగా...
కెనడాలో తన వ్యతిరేక వర్గం వారిపై భారత గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దాడులు చేస్తోందనే ఆరోపణలున్నాయి. కొందరి హత్య వెనుక కెనడాలోని బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందనే విమర్శలు వచ్చాయి. తాజాగా కపిల్ శర్మ కేఫ్ పై రెండుసార్లు కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో కెనడాలో బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరిగాయని, దానిని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ప్రధాని మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ లేఖ రాసింది. భారత్-కెనడా మధ్య జస్టిన్ ట్రూడో హయాంలో దారుణంగా దెబ్బతిన్న సంబంధాలు కార్నీ ప్రభుత్వం వచ్చాక గాడినపడుతున్నాయి. ఇంతలోనే బిష్ణోయ్ గ్యాంగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ ఫ్రాంక్ కాపుటో లేఖ రాయడం గమనార్హం.
నేర సామ్రాజ్యం విస్తరణ...
కెనడాలో క్రమక్రంగా బిష్ణోయ్ నేర సామ్రాజ్యం విస్తరిస్తోందని.. పౌరులను దోచుకోవడం, హత్యలకు పాల్పడడంలో వీరి పాత్ర ఉందని ఎంపీ ఫ్రాంక్ ఆరోపించారు. స్థానికంగా, విదేశాల్లో పలు హింసాత్మక ఘటనలకు బాధ్యులం తామే అని ప్రకటించుకుంది బిష్ణోయ్ గ్యాంగ్. దీన్ని ఫ్రాంక్ ప్రస్తావిస్తూ చర్యలకు డిమాండ్ చేశారు. రాజకీయ, మత, సైద్ధాంతిక కారణాలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ చర్యలన్నీ ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు తగినవే అని పేర్కొన్నారు. గతంలోనూ పలువురు ఎంపీలు.. బిష్ణోయ్ గ్యాంగ్ చర్యలపై పలు ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అదే జరిగితే..
కెనడాలో భారత సంతతి ప్రజల ప్రాబల్యం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో భారత్ కు చెందిన పలు ఆరోపణలున్న వ్యక్తి గ్యాంగ్ పై ఉగ్రవాద ముద్ర వేయడం పెద్ద చర్యే అవుతోంది. అంతర్జాతీయంగానూ మన దేశానికి అది చెడ్డ పేరు తెస్తుంది. కాగా, బిష్ణోయ్ గ్యాంగ్ మీద చర్యలకు రాజకీయంగా ఏకాభిప్రాయం ఉందని ఎంపీ ఫ్రాంక్ పేర్కొనడం గమనార్హం.
