ఆడపిల్లలకు క్యాంపస్ లు సేఫ్ కాదా..?
అవును... లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తాజాగా తీవ్ర సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 29 Jun 2025 8:45 AM ISTదక్షిణ కోల్ కతా లా కాలేజ్ కు చెందిన 24 ఏళ్ల విద్యార్థినిపై బుధవారం రాత్రి క్యాంపస్ లో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదలలేదని బాధితురాలి చెప్పింది! గత ఏడాది ఆగస్టులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో.. క్యాంపస్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది.
అవును... లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తాజాగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో.. గురువారం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా... ఆమె సామూహిక అత్యాచారం జరిగిందని చేసిన ఫిర్యాదును వైద్యులు ధృవీకరించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దీంతో... గంటల వ్యవధిలోనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 - 10:50 గంటల మధ్య జరిగింది. ఆ సమయానికి క్యాంపస్ దాదాపు నిర్మానుష్యంగా మారిందని అంటున్నారు. తనకు తీవ్ర భయాందోళనలు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వారికి చెప్పిందని.. తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని వేడుకుందని.. అయినప్పటికీ వారు నిరాకరించారని.. తన బ్యాగ్ లో ఉన్న ఇన్హెలర్ మాత్రమే వాడుకోడానికి అనుమతి ఇచ్చారని చెబుతున్నారు.
సుమారు మూడు గంటలకు పైగా తనను నిర్బంధంలో ఉంచి సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను బయటకు వెళ్ళడానికి అనుమతించారని.. అప్పుడు బయటకు వచ్చిన బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసింది.. ఆయన వెంటనే వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడని చెబుతున్నారు. దీంతో.. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాల క్యాంపస్ లో జరిగిన అనేక అల్లర్లలో మిశ్రా కీలక పాత్ర పోషించాడని వర్గాలు తెలిపాయి.
మరోసారి వెలుగులోకి ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన!:
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దాదాపు ఏడాది క్రితం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేసులో సంజయ్ రాయ్ దోషిగా తేల్చిన కోల్ కతా కోర్టు.. అతడికి జీవిత ఖైదు విధించింది. ఇదే సమయంలో.. బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు పరిహారంగా చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆసుపత్రి లోపల ఒక సెమినార్ గదిలో డాక్టర్ మృతదేహం కనుగొనబడిన ఒక రోజు తర్వాత రాయ్ ని అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 103(1) కింద కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. దర్యాప్తుకు నాయకత్వం వహించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నేరం జరిగిన స్థలంలో రాయ్ ఉన్నాడని తెలిపే డీ.ఎన్.ఏ, టాక్సికాలజీ నివేదికలు సమర్పించింది.
ఈ క్రమంలో సుమారు 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా.. బాధితురాలు గొంతు కోసి చంపడం వల్ల మరణించిందని, అంతకంటే ముందు ఆమెపై అత్యాచారం చేశాడని సీబీఐ తేల్చింది! దర్యాప్తు అధికారులు దీనిని అరుదైన వాటిలో అరుదైన కేసుగా అభివర్ణించారు.
క్యాంపస్ భద్రతపై మళ్లీ చర్చ!:
నాడు ఆస్పత్రిలో డ్యూటీ చేస్తున్న జూనియర్ వైద్యురాలు.. నేడు కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థిని.. ఇద్దరూ వారి వారి క్యాంపస్ లలోనే అత్యాచారాలకు గురయ్యారు. దీంతో... నడి రోడ్డు, సినిమా హాల్, పార్క్, హోటల్, ఆఫీస్, స్కూల్, కాలేజ్, క్యాంపస్, పనిచేసే చోటు... ఇలా ఎక్కడా మహిళకు రక్షణ లేదా అనేచర్చ తెరపైకి వచ్చింది.
ఒక కాలేజీ క్యాంపస్ లో రాత్రి 7:30 గంటల సమయలోనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక విద్యార్థిని గదిలోకి ఈడ్చుకెళ్లి, అత్యాచారం చేయడం, ఆ ఘటనను వీడియో తీశారని చెబుతుండటం, తనకు ఆరోగ్యం సహకరించడం లేదన్నా దయచూపకపోవడం, కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించకపోవడం చూస్తుంటే... ఎక్కడికి పోతున్నామనే ఆలోచన రాకమానదు!
ఆ యువకులను తల్లితండ్రులు పెంచే విధానంలో లోపమా, వారు పెరుగుతున్న సమాజంలో లోపమా.. లేక, ఆ యువతి ఈ సమాజంలో జన్మించడమే పాపమా? సమాధానం ఎవరు చెప్పాలి?.. ఎవరు చెబుతారు?
