Begin typing your search above and press return to search.

పరిచయం లేని మహిళలను అలా పిలిస్తే లైంగిక వేధింపే!

అనంతరం కలకత్తా హైకోర్టును జనక్‌ రామ్‌ ఆశ్రయించాడు. కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టుకు చెందిన పోర్ట్‌ బ్లెయిర్‌ బెంచ్‌ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ జే సేన్‌ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   3 March 2024 1:48 PM GMT
పరిచయం లేని మహిళలను అలా పిలిస్తే లైంగిక వేధింపే!
X

కలకత్తా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తెలియని మహిళలను ఎవరినైనా డార్లింగ్‌ అని పిలిస్తే అది నేరమేనని స్పష్టం చేసింది. డార్లింగ్‌ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకు వస్తుందని తేల్చిచెప్పింది. తెలియని మహిళను డార్లింగ్‌ అని పిలవడం భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 354ఎ, 509 ప్రకారం క్రిమినల్‌ నేరం కిందకు వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కలకత్తా హైకోర్టుకు చెందిన హైకోర్టు పోర్ట్‌ బ్లెయిర్‌ బెంచ్‌ తాజాగా తీర్పు ఇచ్చింది.

గతేడాది అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మాయాబందర్‌ ప్రాంతంలో దుర్గా పూజ సందర్భంగా పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ తో జనక్‌ రామ్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతను.. ఆమెను డార్లింగ్‌ అని పిలవడంతోపాటు 'చలాన్‌ ఇవ్వడానికి వచ్చావా' అంటూ అసభ్యంగా మాట్లాడాడు.

అతడిపై మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన నార్త్‌ – మిడిల్‌ అండమాన్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు అతడిని దోషిగా తీర్పు ఇచ్చింది.. మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో జనక్‌ రామ్‌ సవాల్‌ చేశాడు. దీన్ని కోర్టు తిరస్కరించింది.

అనంతరం కలకత్తా హైకోర్టును జనక్‌ రామ్‌ ఆశ్రయించాడు. కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టుకు చెందిన పోర్ట్‌ బ్లెయిర్‌ బెంచ్‌ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ జే సేన్‌ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనక్‌ రామ్‌ చేసింది నేరమేనని తెలిపారు. 'జనక్‌ రామ్‌ మద్యం మత్తులో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌ ని 'డార్లింగ్‌' అని పిలిచాడు. సెక్షన్‌ 354ఎ ప్రకారం ఇది క్రిమినల్‌ నేరం. ఇందుకు జరిమానా కూడా విధించొచ్చు' అని జడ్జి తెలిపారు.

మద్యం మత్తులో లేదా సాధారణంగా ఉన్న వ్యక్తి ఎవరైనా తెలియని మహిళను 'డార్లింగ్‌' అని పిలవడం చాలా అభ్యంతరకరమని పోర్ట్‌ బ్లెయిర్‌ హైకోర్టు బెంచ్‌ పేర్కొంది. పోలీసు కానిస్టేబుల్‌ అయినా, కాకపోయినా, వీధిలో ఒక వ్యక్తి, మద్యం తాగినా, లేకున్నా తెలియని మహిళను ఉద్దేశించి 'డార్లింగ్‌' అనే పదంతో మాట్లాడటం చాలా అభ్యంతరకరమైనది అని న్యాయమూర్తి జస్టిస్‌ సేన్‌ గుప్తా చెప్పారు. డార్లింగ్‌ అంటూ పిలవడం లైంగిక ఉద్రేకంతో కూడినదేనని పేర్కొన్నారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందని న్యాయమూర్తి గుర్తు చేశారు. దేశంలో మహిళలను దేవతల్లా కొలుస్తారన్నారు. అలాంటి దేశంలో ఇలాంటివి జరగడం క్షమించరానివన్నారు. పరిచయం లేని స్త్రీల విషయంలో డార్లింగ్‌ లాంటి పదాలను పురుషులు ఉపయోగించకూడదన్నారు.

తెలియని స్త్రీని 'డార్లింగ్‌' అని పిలవడం నేరం. ఎవరైనా మద్యం తాగనప్పుడు, సాధారణంగా ఉన్నప్పుడు డార్లింగ్‌ లాంటి పదాలు వాడితే నేరం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైకోర్టు బెంచ్‌ పేర్కొంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.