Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాల పక్కరోజు కేబినెట్ భేటీ లెక్కేంది?

ఓవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కట్టకట్టుకొని మరీ తెలంగాణలో కాంగ్రెస్ చేతికి అధికారం వస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Dec 2023 6:54 AM GMT
ఎన్నికల ఫలితాల పక్కరోజు కేబినెట్ భేటీ లెక్కేంది?
X

ఓవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కట్టకట్టుకొని మరీ తెలంగాణలో కాంగ్రెస్ చేతికి అధికారం వస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వచ్చిన ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఆదివారంఉదయం ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. మధ్యాహ్నానానికి తుది ఫలితం ఎలా ఉండనుందన్న విషయంపై ఫుల్ క్లారిటీ రానుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు పూర్తై.. ఫలితం సానుకూలంగా వస్తే తప్పించి కేబినెట్ భేటీని ఏర్పాటు చేయటం ఉండదు.

కానీ.. రోటీన్ కు భిన్నంగా కేబినెట్ భేటీ సోమవారం ఉంటుందని సీఎం కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పలువురు సందేహాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకవేళ.. ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఓడిపోతే.. పరిస్థితేంటి? కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంటుందా? రూల్ పొజిషన్ ఏం చెబుతుంది? లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడి. ఫలితం ప్రతికూలంగా వస్తే.. వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటం.. ఆయన్ను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని గవర్నర్ కోరటం.. కొత్త ప్రభుత్వం కొలువు తీరే వేళకు.. తప్పుకోవటం లాంటివి జరుగుతుంటాయి.

కేసీఆర్ లెక్కల ప్రకారం పార్టీ గెలవటమే ఖాయమైతే.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. ఓడితే పరిస్థితేంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పార్టీ ఓడిన తర్వాత కూడా కేబినెట్ భేటీ నిర్వహిస్తారా? అలా చేస్తే.. మంత్రులు హాజరవుతారా? ఒకవేళ.. ఓడిన తర్వాత నిర్వహించే కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అంశాలేంటి? లాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. రాజకీయ వర్గాలు.. మీడియా సర్కిల్స్ లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కేబినెట్ ప్రకటన మొత్తం కూడా మైండ్ గేమ్ లో భాగమని చెబుతున్నారు. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార పార్టీ ఓటమి తథ్యమన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. క్యాడర్ లోనూ.. నేతల్లోనూ నిరాశ నిస్ప్రహలకు లోనైతే.. మరింత ఇబ్బంది ఉంటుందని.. అలాంటిదేమీ లేకుండా మేకపోతు గాంభీర్యంలో భాగంగానే కేబినెట్ భేటీ మాట చెప్పి ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ.. పార్టీ ఓడిన పక్షంలో.. కేబినెట్ భేటీని రద్దు చేస్తూ నిర్ణయాన్ని విడుదల చేస్తే సరిపోతుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా కేబినెట్ భేటీ అన్న మాటతో పార్టీ నేతల్లోనూ.. కేడర్ లోనూ ఉత్సాహాన్ని రేకెత్తించటమే లక్ష్యమన్న మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే గులాబీ నేతలు పలువురు మాత్రం పార్టీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేయటం గమనార్హం. మరేం జరుగుతుందో చూడాలి.