విమానం ఎగిరేంత వరకూ అయినా...రామ్మోహన్ సంగతేంటి ?
కేవలం ఇరవై రోజుల వ్యవధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
By: Satya P | 15 Jun 2026 9:14 AM ISTకేవలం ఇరవై రోజుల వ్యవధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అపరెషన్స్ స్టార్ట్ కానున్నాయి. నూటికి తొంబై శాతం జూలై 5వ తేదీన నరేంద్ర మోడీ భోగాపురం వచ్చి ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు అని అని గట్టిగా చెబుతున్నారు. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగిగే సమయానికి ఉత్తరాంధ్ర కు చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే రాజకీయంగా సాగుతోంది.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ :
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 20న ఉండొచ్చు అని ప్రచారం అయితే హస్తిన వర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ నెల 10న ఢిల్లీలో ఎన్డీయే పక్ష సమావేశం కూడా జరిగింది. ఈ సందర్భంగా మిత్రులందరితోనూ బీజేపీ పెద్దలు చర్చించారు అని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే రాజ్యసభ ఎన్నికలు కూడా జూన్ 18 నాటికి ముగిసి ఫలితాలు వస్తాయి. దాంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు అన్నీ అనుకూలిస్తాయని అంటున్నారు. దాంతో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. అదే సమయంలో చాలా మంది మంత్రుల శాఖలు మారుతాయని కూడా అంటున్నారు. మరి ఆ జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ పేరు కూడా ఉందని అంటున్నారు.
వేరే శాఖకు షిఫ్ట్ :
ఇక కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగినా లేక పునర్ వ్యవస్థీకరణ జరిగినా కీలక మంత్రుల శాఖలలో మార్పులు ఉంటాయని చెబుతున్నారు. ఆ లెక్కన ఏపీ నుంచి ఏకైన కేబినెట్ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పౌర విమాన యాన శాఖను వేరే వారికి బదలాయించి ఆయనకు మరో కీలక శాఖ కట్టబెట్టవచ్చు అని ప్రచారం సాగుతోంది. ఆయనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తారు అని కూడా అంటున్నారు. ఆ శాఖ చాలా మంచిదే. పైగా ఏపీకి ఎంతోగానో ఉపయోగపడే శాఖగా కూడా ఉండనుంది. అయితే అక్కడే చిన్న తకరారు ఉందని అంటున్నారు.
స్పీడప్ చేసిన వైనం :
ఇక కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రిగా 2024 లో బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దాంతో అనుకున్న సమయానికి శర వేగంగా ఎయిర్ పోర్టు పూర్తి అయింది. అంతా అయింది ఇక ఓపెనింగ్ మాత్రం పెండింగులో ఉంది. ప్రధాని డేట్స్ కోసమే అంతా చూస్తున్నారు. జూలైలో ఆయన వచ్చి ప్రారంభిస్తారు అనుకుంటున్నారు. మరి ఆ సమయానికి రామ్మోహన్ నాయుడు పౌర విమాన యాన శాఖ మంత్రిగా ఉంటారా లేదా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఆయన ఆ శాఖ మంత్రిగా ఉంటే ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ఓపెనింగ్ శిలా ఫలకం మీద ఆయన పేరు ఆ హోదాలో ఉంటుంది అని అంటున్నారు.
ఒక విధంగా అది జీవిత కాల సాఫల్యం లాంటిది అని కూడా అంటున్నారు. ఉత్తరాంధ్ర కు ఏమి చేశారు అంటే ఈ ఎయిర్ పోర్టుని చూపించుకునే అవకాశం కచ్చితంగా ఉండడమే కాదు చరిత్రలో కూడా నిలిచిపోతుంది. అందుకే ఈ యువ మంత్రి తన శాఖ మార్పుకు సంబంధించి వస్తున్న వార్తల విషయంలో ఒకింత ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరి కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అన్నది దేశవ్యాప్తంగా ఒకేసారి చేస్తారు. రామ్మోహన్ శాఖ మార్పు కూడా అందులో భాగంగానే జరుగుతుంది. అలాగని ఆయన శాఖను కొద్ది రోజులు వాయిదా వేసి తరువాత కొత్త శాఖ కేటాయిస్తారా అంటే అది వీలైనదే కానీ ఎన్డీయే పెద్దలు అంతగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.మరి రామ్మోహన్ కోసం ఎన్డీయే పెద్దలు ఈ చొవర తీసుకుంటారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.
