దాడి చేసే చోట.. స్టేషన్ లోనూ.. హాస్పటల్ లోనూ మేమే... బైరెడ్డి మార్క్ వార్నింగ్ వైరల్!
ఏపీలో రాజకీయం.. రాజకీయం దాటి అన్నట్లుగా గత కొన్ని రోజులుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 2 Feb 2026 11:43 AM ISTఏపీలో రాజకీయం.. రాజకీయం దాటి అన్నట్లుగా గత కొన్ని రోజులుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఉండే రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల మాటున ఇప్పుడు బూతుల పంచాంగాలు.. ఫలితంగా పెట్రోల్ బాంబులు, వాహనాల ధ్వంసాలు, నివాసాలకు నిప్పులు వంటి టాపిక్స్ తెరపైకి వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇది సరైన ఆలోచనలు కాదని అంటున్న వేళ.. తాజాగా ఈ విషయంపై పెట్రోల్ పోసే పనికి పూనుకున్నారు బైరెడ్డి సిద్ధార్ రెడ్డి!
అవును... రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం.. అధికారాన్ని అధికారికంగా కాపాడుకోవడం.. ప్రజల మన్ననలు నిజాయితీగా పొందడం.. వారిని అభివృద్ధి చేయడం స్థానే.. పార్టీల పేరు చెప్పో, కులాలు, మతాల పేరు చెప్పో విధ్వేషాలు రెచ్చ గొట్టడం గొప్పగా మారిపోయిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రగులుతున్న అగ్నిలో నెయ్యి పోసేలా అన్నట్లుగా వ్యాఖ్యానించారు బైరెడ్డి సిద్ధార్ రెడ్డి. తాజాగా ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వైసీపీ తలపెట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమం ఏపీలో తీవ్ర ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం.. దేవాలయాల్లో పూజలు చేయడం వంటి కార్యక్రమాలకు తెర తీశారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవ్వగా.. తదనంతర పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి.. జోగి రమేష్ కు ఎఫెక్ట్ తగిలిన పరిస్థితి!
ఈ పరిణామాల నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... ఇదే పరిస్థితులు రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా అని ప్రశ్నించిన సిద్ధార్థ్ రెడ్డి... దాడి చేసే ప్రదేశంలోనూ తామే ఉంటామని, భయపడి పోలీస్ స్టేషన్ కు పారిపోతే అక్కడా తామే ఉంటామని, గాయాలతో హాస్పటల్ కు పోతే అక్కడా తామే ఉంటామని, చివరికి నిద్రపోయినప్పుడు కలలో కూడా తామే ఉంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుందంటూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలకు గానూ ఆయన నివాసంపై దాడి.. జోగి రమేష్ అభ్యంతరకర వ్యాఖ్యలు ఆయన ఇంటిని నిప్పు పెట్టండం వంటి పరిణామాల నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. భవిష్యత్తులో ఏపీలో ఎలాంటి పరిస్థిఉలు నెలకొంటాయనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
