Begin typing your search above and press return to search.

జగన్ సార్ ఆ పని చేయమాకండి... బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి !

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎవరి సలహాలు అయినా వింటారా లేదా అన్నది చూస్తే ప్రత్యర్ధులు ఆయన ఎవరి మాటా వినరు అని ఒక్క మాటతో తేల్చేస్తారు.

By:  Satya P   |   12 Jun 2026 9:15 AM IST
జగన్ సార్ ఆ పని చేయమాకండి... బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి !
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎవరి సలహాలు అయినా వింటారా లేదా అన్నది చూస్తే ప్రత్యర్ధులు ఆయన ఎవరి మాటా వినరు అని ఒక్క మాటతో తేల్చేస్తారు. సొంత పార్టీ వారు కూడా జగన్ ఎక్కువగా తన స్వీయ నిర్ణయాల మీదనే ఆధారపడతారు అని చెబుతారు. జగన్ అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అని ఒకసారి కనుక ఆయన డెసిషన్ తీసుకున్నారా ఇక వెనక్కి తగ్గేది ఉండదని కూడా అంటారు. అయినా సరే పార్టీ వారు ఆయనకు ఎన్నో సూచనలు చేస్తూ ఉంటారు. వాటిని ఆయన కూడా కన్సిడర్ చేస్తారు అని చెప్పే వారూ ఉన్నారు.

బైరెడ్డి రిక్వెస్ట్ :

ఇదిలా ఉంటే ఉమ్మడి కర్నూల్ జిల్లాకు చెందిన యువ నేత బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి జగన్ కి తాజాగా ఒక సూచన చేశారు. అది కూడా మీడియా ముఖంగానే ఆయన చేశారు. జగన్ సర్ ఆ పని చేయమాకండి అంటూనే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. వైసీపీ ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఓటమితో ఉంది. 11 సీట్లకు పరిమితం అయి ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ కోసం పనిచేసే వారు తగ్గిపోయారు. కూటమి కేసులు పెడుతుందనో లేక తమ వ్యాపారాలు పోతాయనో లేక తాము ఎందుకు ఎదురుపడి రోడ్ల పైకి రావాలని ఆలోచించుకునో మొత్తానికి మెజారిటీ నేతలు అయితే ఈ రోజుకీ ముఖం చాటేస్తున్నారు. వారంతా కూడా సీనియర్లుగా ఉన్న వారు ఉన్నారు. పదవులు అనుభవించిన వారుగా కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారి విషయంలో జగన్ సార్ జాగ్రత్త అని బైరెడ్డి సూచనలు చేశారు.

నెల రోజుల ముందే :

ఇపుడు డబుల్ గేమ్ ఆడుతున్న వారు ఇతర పార్టీలతో కుమ్మక్కు అవుతున్న వారు ఉన్నారని ఆయన సొంత పార్టీ వారి మీదనే హాట్ కామెంట్స్ చేశారు. అందువల్ల వీరంతా సమయం వచ్చినప్పుడు సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీ వైపు చూస్తారని తామంతా వైఎస్సార్ కుటుంబానికి తర తరాలుగా అనుబంధం అని చెప్పి మరీ వారు అధినేత ముందు తన వినయం ప్రదర్శిస్తారు అని బైరెడ్డి అంటున్నారు. అలాంటి నాయకులను చూసి మరీ దూరం పెట్టాలని ఆయన కోరుతున్నారు.

వారికే ప్రయారిటీ :

జగన్ ఈ విషయంలో అన్నీ గమనించాలని పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి కోరుతున్నారు. పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తించి వారికే పెద్ద పీట వేయాలని కూడా ఆయన అంటున్నారు. అపుడే జవాబు దారీ తనం కూడా నేతలలో పెరుగుతుందని పనిచేసే వారికే పదవులు ఇస్తారంటే అందరూ జనంలోకి వస్తారు అని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఈ యువ నేత చేసిన సూచన బాగానే ఉంది కానె అధినాయకత్వం ఏ మేరకు దీనిని పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఎన్నికల సమయంలో అంగ బలం అర్ధ బలం ఇంకా చాలా ఫ్యాక్టర్లు పనిచేస్తాయి. దానిని బట్టే టికెట్లు ఇస్తారు. అలాగే కుటుంబాల నేపధ్యం, రాజకీయ అనుభవం వ్యూహాలు అన్నీ వర్కౌట్ అవుతాయి. మరి ఆ విధంగా ఆచీ తూచీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బైరెడ్డి చెప్పినది మాత్రం పార్టీ భవిష్యత్తు గురించే అని అంటున్నారు. చూడాలి మరి అధినాయకత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో.