శబరి దూకుడు.. కూటమికి తంటానా..!
కర్నూలు ఎంపీ, టీడీపీ నాయకురాలు బైరెడ్డి శబరి దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ఆమె ప్రతిపక్షం వైసీపీని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 17 April 2025 12:30 PMకర్నూలు ఎంపీ, టీడీపీ నాయకురాలు బైరెడ్డి శబరి దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ఆమె ప్రతిపక్షం వైసీపీని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ నేతల గోదాముల్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరోపించిన ఆమె.. 24 గంటలు గడవకముందే.. వాటిని సీజ్ చేయించేలా వ్యవహరించారు. అయితే.. ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగుతుండడంపై.. ఆమె నిప్పులు చెరగడం గమనార్హం.
ఏం జరిగింది...
పాణ్యం మండలం కాటసాని రాంభూపాల్ రెడ్డి గోరుకల్లు తాండ లో అక్రమంగా నిల్వ ఉంచిన 500 రేషన్ బియ్యం,అలాగే తమ్మరాజుపల్లె గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 క్వింటాళ్ల రేషన్ బి య్యం అక్రమ గోదాములపై బుధవారం రాత్రి ఎంపీ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు. 1500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సిజ్ చేశారు. వీటిని పాణ్యం ఎం ఆర్ ఓ కు అప్పగించారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించారు.
ఇక, శబరి దూకుడుతో వైసీపీ నాయకులు మౌనంగా ఉండిపోయారు. సరిచేసుకునే అవకాశం కూడా ఇవ్వ కుండానే.. శబరి దూకుడుగా వ్యవహరించడంతో నాయకులు విస్తుపోతున్నారు. వాస్తవానికి.. కర్నూలులో రేషన్ బియ్యం వ్యవహారం ఎప్పుడూ పార్టీలకు టార్గెట్ గానే మారింది. అయితే.. అందరూ సర్దు పోయే రాజకీయాలు మాత్రమే చేశారు. దీంతో ఎప్పుడు బయట పడడం అన్నది చాలా చాలా తక్కువగానే జరిగింది.
అయితే.. తొలిసారి శబరి.. వ్యక్తిగత అజెండాను పెట్టుకుని ముందుకు సాగుతున్నారన్న చర్చ ఉంది. దీంతో వైసీపీ నాయకులను ఆమె టార్గెట్ చేస్తున్నారు. కానీ, వాస్తవానికి.. దీనిలో కొందరు అధికార పార్టీ నాయకుల హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నాయకులు.. ఇదేం పద్దతని గొణుక్కుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరికివారు వ్యాపారాల విషయంలో జోక్యం చేసుకోలేదని.. కానీ.. ఇప్పుడు వ్యాపారాలపై దాడులు చేస్తే.. రేపు అది మన మెడకే చుట్టుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. కానీ.. శబరి మాత్రం తన నియోజకవర్గంలో ఎలాంటి తప్పులు జరిగినా ఊరుకునేది లేదని చెబుతున్నారు.