Begin typing your search above and press return to search.

ఉగ్రవాదుల అరాచకం..కళ్లముందే ఊచకోత..గర్భిణులు, పసిపిల్లలు సహా 100మంది బలి!

ప్రపంచం నివ్వెరపోయేలా.. ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు తమ కిరాతకత్వాన్ని మరోసారి ప్రదర్శించారు.

By:  Tupaki Desk   |   13 May 2025 11:21 AM IST
Jihadi Terror Leaves Hundreds Dead, World in Shock
X

ప్రపంచం నివ్వెరపోయేలా.. ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు తమ కిరాతకత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. వారి కత్తికి నెత్తుటి రుచి మరిగింది. వందల సంఖ్యలో అమాయక ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. సైనికులు సైతం వారి దాడికి బలయ్యారు. కడుపులో బిడ్డతో ఉన్న గర్భిణులు, లోకం తెలియని పసిపాపలు సైతం ఈ మారణహోమంలో కాలిబూడిదయ్యారు. ఈ దారుణం యావత్ మానవాళిని నిశ్చేష్టులను చేసింది.

డజిబోతో పాటు పరిసర ప్రాంతాలు ఇప్పుడు భీతావహమైన దృశ్యాలతో నిండి ఉన్నాయి. స్థానికులు తమ కళ్ల ముందే జరిగిన భయానక హింసను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి తోచిన దిక్కుకు పరుగులు తీసిన భయానక క్షణాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. కొంతమంది మహిళలు, చిన్నారి బాలికలను సైతం ఈ రాక్షస మూకలు బలవంతంగా ఎత్తుకుపోయారని బాధితుల కుటుంబాలు గుండెలు పగిలేలా రోదిస్తున్నాయి.

ఈ దుర్ఘటనతో బుర్కినా ఫాసో ప్రజల్లో భద్రతా వ్యవస్థపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెలల తరబడి ఉగ్రవాదులు చెలరేగిపోతున్నా ప్రభుత్వం వారిని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. స్థానిక భద్రతా బలగాలు కూడా ఉగ్రవాదుల ఆటలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ అమానుష దాడులను ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాల నాయకులు సైతం తీవ్రంగా ఖండించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. బుర్కినా ఫాసోలో నెలకొన్న ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ప్రపంచ శాంతికి పెను సవాలు విసురుతున్నాయి.