Begin typing your search above and press return to search.

రూటు మార్చిన బుగ్గున.. వైసీపీలో తీవ్ర చర్చ

మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేందర్ రెడ్డి సరికొత్త చర్చకు తెరలేపారు.

By:  Tupaki Desk   |   6 Dec 2025 6:00 PM IST
రూటు మార్చిన బుగ్గున.. వైసీపీలో తీవ్ర చర్చ
X

మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేందర్ రెడ్డి సరికొత్త చర్చకు తెరలేపారు. గత ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బుగ్గున.. వచ్చే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో ఈ సారి ఎంపీ అవ్వాలనే ఆలోచనలో బుగ్గున ఉన్నట్లు వైసీపీలో టాక్ నడుస్తోంది. నంద్యాల పార్లమెంటు పరిధిలోనే తన సొంత నియోజకవర్గం డోన్ ఉండటం, ప్రస్తుతం నంద్యాల పార్లమెంటుకు సరైన నాయకత్వం లేకపోవడంతో తాను ఆ లోటు పూడ్చుతానని, నంద్యాల సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిని బుగ్గున కోరుతున్నట్లు చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గున.. ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగారు. జగన్ కేబినెట్ లో ఐదేళ్లు పనిచేసిన కొద్దిమంది నేతల్లో బుగ్గున ఒకరు. ఇంగ్లీషు, హిందీల్లో బాగా మాట్లాడటం, బాగా చదువుకున్న వ్యక్తి కావడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వంలో బుగ్గునకు ఆర్థికశాఖ బాధ్యతలు అప్పగించారు. అధినేత మోపిన బాధ్యతలను నిర్వహించడానికి తీవ్రంగా శ్రమించిన బుగ్గున, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి రుణాలు, నిధులు వంటి విషయాలలో ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అయితే అప్పట్లో తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బుగ్గున గత సారే నంద్యాల పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారని టాక్ ఉంది.

అయితే పార్టీ అధిష్టానం నిర్ణయంతో బుగ్గున గత ఎన్నికల్లో డోన్ నుంచే పోటీ చేయాల్సివచ్చింది. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సుమారు 80 మందికి పైగా శాసనసభ్యులు, ఇంచార్జుల సిటింగ్ స్థానాలను మార్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మాత్రం బుగ్గున జోలికి వెళ్లలేదు. దీనికి కారణం ఆయన మళ్లీ గెలుస్తారనే నమ్మకమే అంటున్నారు. అయితే కూటమి హవాలో బుగ్గన కూడా కొట్టుకుపోయారు. డోన్ నియోజకవర్గం అంటే కోట్ల, కేఈ కుటుంబాలే గుర్తుకు వస్తాయి. అటువంటి రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, వారిని ఎదిరించి బుగ్గున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొడతారని జగన్ విశ్వసించారు. కానీ, ఫలితాలు విరుద్ధంగా రావడంతో బుగ్గన కూడా నిరుత్సాహానికి గురయ్యారని అంటున్నారు.

దీంతో ఎన్నికల అనంతరం ఎక్కువగా హైదరాబాదులో ఉంటున్న బుగ్గున.. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పార్లమెంటుకు మాత్రమే పోటీ చేస్తానని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తనకు నంద్యాల పార్లమెంటు సీటు ఇవ్వాలని, తన స్థానంలో డోన్ లో కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి పోటీ చేస్తారని రాజేంద్రనాథ్ రెడ్డి అధి నాయకత్వానికి తెలియజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నంద్యాల పార్లమెంటులో టీడీపీ తరఫున గెలిచిన బైరెడ్డి శబరి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన శబరి లేడీ సింగంలా పనిచేస్తున్నారని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దీటైన నాయకుడిని వైసీపీ అన్వేషిస్తోంది. అయితే నంద్యాలలో పోటీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా ఆసక్తి చూపుతుండటంతో ఆయన చాన్స్ ఇస్తుందా? లేక వేరెవరినైనా తీసుకువస్తుందా? అన్నదే ఇప్పుడు రాయలసీమ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.