Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులూ సలహాలిస్తారా? వైఎస్ ఫ్యాన్స్ పునరాలోచించుకోవాలట..!

కడపలో టీడీపీ మహానాడు విజయవంతం అయిన నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   31 May 2025 2:00 AM IST
ప్రత్యర్థులూ సలహాలిస్తారా? వైఎస్ ఫ్యాన్స్ పునరాలోచించుకోవాలట..!
X

రాజకీయ ప్రత్యర్థులు అంటే విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కొన్నిసార్లు వ్యంగ్యస్త్రాలు ఎదుర్కోవాల్సివుంటుంది. కానీ తమ ప్రత్యర్థులకు సలహాలు, సూచనలు ఎవరైనా ఇస్తారా? కడప జిల్లా పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఈ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే బీటెక్ రవి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఓ సలహా ఇచ్చారు. కడపలో టీడీపీ మహానాడు విజయవంతం అయిన నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మహా నాడు సందర్బంగా కడపలో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్న చోట టీడీపీ జెండా తోరణాలు కట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. కడపలో ఓ జంక్షన్ లో వైఎస్ విగ్రహం ఉండగా, దాని చుట్టూ టీడీపీ జెండాలు కట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ ధర్నా చేసింది. మాజీ సీఎం, దివంగత రాజశేఖర్ రెడ్డికి అవమానించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. అంతేకాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక దీనిపై టీడీపీ కూడా స్పందించింది. మహానాడు సందర్భంగా రోడ్లకు అలంకరించిన జెండా తోరణాలు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు మరో 15 మందిని నిందితులుగా చేర్చారు. దీనిపై మీడియా మాట్లాడిన పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అభిమానులకు తానొక సలహా ఇస్తానని, కచ్చితంగా వారు పాటించాలని కోరారు బీటెక్ రవి.

వైఎస్ కుమారుడిగా మాజీ సీఎం జగన్ ను అభిమానిస్తున్న రాజశేఖర్ రెడ్డి అనుచరులు పునరాలోచించుకోవాలని బీటెక్ రవి సూచించారు. వైఎస్ సతీమణి విజయలక్ష్మిపై కేసు నమోదు చేయించినవారు ఎవరో ఆలోచించాలని రాజశేఖర్ రెడ్డి అభిమానులను కోరారు బీటెక్ రవి. అంతేకాకుండా రామలక్ష్మణుల్లా రాజకీయం చేసిన రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకాను హత్య చేయించింది ఎవరని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ని అడ్డుపెట్టుకుని ఆయన వారిని మోసం చేస్తున్నారంటూ జగన్ పై బీటెక్ రవి ధ్వజమెత్తారు.