Begin typing your search above and press return to search.

బీఎస్ఎఫ్ కి ‘చికెన్ నెక్’.. చైనా వ్యూహాలకు చెక్.. బెంగాల్ సీఎం సువేందు సంచలనం

జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By:  Tupaki Political Desk   |   19 May 2026 1:19 PM IST
బీఎస్ఎఫ్ కి ‘చికెన్ నెక్’.. చైనా వ్యూహాలకు చెక్.. బెంగాల్ సీఎం సువేందు సంచలనం
X

జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాలలో 120 ఎకరాలకు పైగా భూమి, జాతీయ రహదారి మార్గాలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కి అప్పగించేందుకు తొలి క్యాబినెట్ భేటీలోనే ఆమోదం ముద్ర వేసిన సువేందు అధికారి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే అత్యంత సున్నితమైన, వ్యూహాత్మక 22 కిలోమీటర్ల 'చికెన్ నెక్'గా పిలిచే సిలిగురి కారిడార్ లోని భూమిని బీఎస్ఎఫ్ కి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టడమే ఆలస్యం అన్నట్లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దశాబ్దాలుగా దేశ రక్షణకు సవాలు విసురుతున్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు. రాష్ట్రంలోని అత్యంత సున్నితమైన, వ్యూహాత్మక 22 కిలోమీటర్ల 'చికెన్ నెక్' ప్రాంతంలో సరిహద్దు ఫెన్సింగ్ నిర్మాణానికి సీఎం సువేందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు వీలుగా భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగిస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేశారు. 45 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశించారు. బంగ్లాదేశ్‌తో సుదీర్ఘ సరిహద్దు కలిగిన ఈ ప్రాంతంలో పూర్తి పట్టు కేంద్రం చేతుల్లోకి వెళ్లనుండటం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

చికెన్ నెక్ రక్షణే దేశ రక్షణ

భౌగోళికంగా 'సిలిగురి కారిడార్' లేదా చికెన్ నెక్ అనేది భారతదేశానికి అత్యంత బలహీనమైన, కీలకమైన లింక్ గా చెబుతున్నారు. చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండే ఈ ఇరుకైన మార్గం ద్వారానే ఈశాన్య రాష్ట్రాలకు రవాణా, సైనిక బలగాల కదలికలు సాగుతాయని చెబుతున్నారు. ఇక బంగ్లాదేశ్ నుండి జరిగే అక్రమ చొరబాట్లు, ఉగ్రవాద మూలాల కదలికలు, నకిలీ నోట్ల చలామణి, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఈ కారిడార్ ప్రధాన కేంద్రంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇకపై దేశభద్రతకు ముప్పు వాటిల్లే కార్యక్రమాలకు అడ్డుకట్ట పడనుందని చెబుతున్నారు.

సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ లేని ప్రాంతాలలో బీఎస్ఎఫ్ కు భూమి లభించడం వల్ల, వ్యూహాత్మక వాచ్ టవర్ల నిర్మాణం, పెట్రోలింగ్ రోడ్ల ఏర్పాటు సులువవుతుందని సైనిక రంగ నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో దేశ రక్షణకు సంబంధించి కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఒకే తాటిపైకి రావడం వల్ల జాతీయ భద్రత మునుపెన్నడూ లేనంతగా పటిష్టం కానుందని వ్యాఖ్యానిస్తున్నారు. గత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమి బదిలీని కావాలనే తొక్కిపెట్టిందనే విమర్శలను గుర్తుచేస్తున్నారు.

సరిహద్దు జిల్లాలైన మాల్దా, ముర్షిదాబాద్, దినాజ్‌పూర్, సిలిగురి ప్రాంతాలలో అక్రమ వలసదారులు కీలక ఓటు బ్యాంకుగా మారారని అంటున్నారు. బీఎస్ఎఫ్ పరిధిని పెంచితే తమ రాజకీయ ప్రయోజనాలకు గండి పడుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం భూసేకరణకు సహకరించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి ముందుగా ఈ సమస్యపైనే దృష్టి పెట్టి తన రాజకీయ ప్రత్యర్థి ఓటు బ్యాంకును దెబ్బతీశారని అంటున్నారు.

సువేందు అధికారి తీసుకున్న ఈ 'ఫస్ట్ స్ట్రైక్' నిర్ణయం బెంగాల్ భవిష్యత్తుపై, దేశ భద్రతపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుందని అంటున్నారు. సరిహద్దులు పూర్తిగా మూసివేయడటం వల్ల బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాల్లో వేగంగా మారుతున్న జనాభా సమతుల్యత అదుపులోకి వస్తుందని చెబుతున్నారు. అదేసమయంలో చికెన్ నెక్ ప్రాంతాన్ని బ్లాక్ చేసి, ఈశాన్య భారతాన్ని వేరు చేయాలనే చైనా వ్యూహాలకు చెక్ చెప్పినట్లేనని విశ్లేషిస్తున్నారు.