Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త విపక్షాన్ని భయపెడుతున్న బీఆర్ఎస్...!?

ఏపీలో హోరా హోరీ పోరు సాగుతోంది. అటు అధికార వైసీపీ మరో సారి అధికారంలోకి రావాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   1 April 2024 3:46 AM GMT
ఏపీలో కొత్త విపక్షాన్ని భయపెడుతున్న బీఆర్ఎస్...!?
X

ఏపీలో హోరా హోరీ పోరు సాగుతోంది. అటు అధికార వైసీపీ మరో సారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇటు విపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి వైసీపీ జోరుని కట్టడి చేస్తోంది.జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ జనంలోకి వస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే విజయం తధ్యమని 2014 రిపీట్ అవడం ఖాయమని ధీమాగా ఉంది.

అయితే ఏపీలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తే కనుక రెండు వైపులా అవకాశాలు ఉన్నాయి. ఎవరు గెలిచినా తక్కువ సీట్లతోనే గెలుస్తారు అని అంటున్నారు. అంటే ఆ రెండవ వారు ఎవరు, ఏపీలో కొత్తగా విపక్షంలోకి వెళ్లేది ఎవరు అన్నది ఇపుడు చర్చగా ఉంది.

అధికార పక్షం అయితే సేఫ్ జోన్ లో ఉంటుంది. ఏపీలో ప్రభుత్వం స్థాపించాలంటే 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. దాన్ని కంటే ఒకటి రెండు సీట్లు ఎక్కువ వచ్చినా బొటాబొటీ మెజారిటీ అయినా ప్రభుత్వం ఏర్పాటుకు అది అవరోధం కాదు.

ఒకసారి అధికారంలోకి వస్తే మాత్రం ఆ మెజారిటీని అంతకు అంత పెంచుకోవడానికి ఏపీలో ఎవరైనా చూస్తారు అని అంటున్నారు. అంటే ఏపీలో విపక్ష పాత్రలోకి ఎవరు వచ్చినా వారి వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టతరం అవుతుంది అని అంటున్నారు. 151 సీట్లు దక్కినా జగన్ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు. అలాగే ఏకైక జనసేన అభ్యర్ధిని కూడా ఆకర్షించారు అని అంటారు.

దాని కంటే ముందు 2014 నుంచి 2019లలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీకి ఆనాడు 102 సీట్లు వచ్చాయి. కంఫర్టబుల్ మెజారిటీ అది. అయినా నాటి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ లాగేసింది. ఇక తెలంగాణాలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ని టీడీపీని వైసీపీని కూడా వదలకుండా కలుపుకుంది.

2018 తరువాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తే కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష స్థానం దక్కకుండా ఏడుగురికే పరిమితం చేసి మరీ మొత్తానికి మొత్తం లాక్కున్న చరిత్ర బీఆర్ఎస్ ది. ఇపుడు కాంగ్రెస్ అదే పని చేస్తోంది. మిత్రపక్షం సీపీఐని కలుపుకుని 65 ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా బీఆర్ఎస్ కి గేలం వేస్తూ వరసబెట్టి ఎమ్మెల్యేలను లాగేస్తోంది. దాంతో విలవిలలాడడం బీఆర్ఎస్ వంతు అవుతోంది.

అసలు బీఆర్ఎస్ లో ఎవరు ఉంటారు ఎవరు ఎక్కడికి వెళ్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. దాంతో ఏపీలో కూడా అదే సీఎన్ రిపీట్ కాబోతోంది అని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో కూడా వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా లేక టీడీపీ వచ్చినా ఊరుకునే ప్రసక్తి ఉండదని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా అధికారం ఎటు ఉంటే అటు వైపు వెళ్ళిపోవడం కూడా ఇటీవల కాలంలో కామన్ అయింది. ఎవరూ నైతిక విలువల గురించి ఆలోచించడం లేదు.

దానికి కారణం రేపు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఎవరి మీద ఎవరికీ నమ్మకం ఉండటం లేదు. ఎన్నికలు కూడా చాలా ఖరీదు అయిపోయాయి. ఎంతో ఖర్చు పెట్టి గెలిచిన తరువాత అయిదేళ్ల పాటు ఏమీ పని చేయకుండా ఉండిపోతే గెలిచి సుఖం ఏంటి అన్న ఆలోచనలు వస్తున్నాయి. దాంతో జంపింగ్ జఫాంగులు ఎక్కువ అయిపోతున్నారు. ఎవరో ఒకటో అరో ఉంటే ఉండవచ్చు కానీ టోటల్ గా పార్టీలనే ఖాళీ చేసేలా ఈ ఫిరాయింపులు సాగుతున్నాయి.

అందువల్ల ఏపీలో గెలిచేందుకే వైసీపీ టీడీపీ చూస్తున్నాయి. పొరపాటున కానీ ఏ పక్షం అయినా విపక్షం అయితే మాత్రం కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలంగాణాలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.