Begin typing your search above and press return to search.

ఏపీలో బీఆర్ఎస్ పరిస్ధితేంటి ?

ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎన్నికలకు చాలాముందు వరకు జాతీయస్ధాయిలో పార్టీని విస్తరించాలని కేసీయార్ చాలా పెద్ద ప్లాన్లు వేశారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 5:30 PM GMT
ఏపీలో బీఆర్ఎస్ పరిస్ధితేంటి ?
X

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంటే ఇక్కడ ఎన్నికల హీట్ తాత్కాలికింగా చల్లబడినట్లే. తాత్కాలికం అని అన్నది ఎందుకంటే మరి కొద్దిరోజులు ఆగితే పార్లమెంటు ఎన్నికల హీట్ మొదలైపోతుంది. కాబట్టి అప్పటివరకు తెలంగాణాలో రాజకీయ వాతావరణం కాస్త చల్లబడినట్లే అనుకోవాలి. ఇదే సమయంలో ఈ వేడంతా ఏపీ రాజకీయాల వైపు మళ్ళుతోంది. ఎందుకంటే అక్కడ ఎంఎల్ఏ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాలి కాబట్టే.

ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎన్నికలకు చాలాముందు వరకు జాతీయస్ధాయిలో పార్టీని విస్తరించాలని కేసీయార్ చాలా పెద్ద ప్లాన్లు వేశారు. ఇందులో భాగంగానే దాయాది రాష్ట్రం ఏపీలో కూడా ఒక యూనిట్ ఏర్పాటుచేశారు. దానికి జనసేన మాజీ నేత చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేశారు. ఆయన కూడా కొంతకాలం చాలా యాక్టివ్ గా పనిచేశారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా కాపుల ఓట్లను చీల్చేయాలని అనేక వ్యూహాలు రచించారు.

ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు ప్రముఖులు, ఉత్తరాంధ్రలోని కాపు నేతలతో సమావేశాలు కూడా జరిపారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అదిచేస్తుంది ఇది చేస్తుందని చాలా మాటలే చెప్పారు. అయితే తెలంగాణా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొద్దిరోజుల ముందునుండి ఎందుకనో చంద్రశేఖర్ సైలెంట్ అయిపోయారు. అంతకుముందు కేసీయార్, కేటీయార్ అండ్ కో అసలు ఏపీని పట్టించుకోవటమే మానేశారు. ఇదంతా బాగానే ఉంది తెలంగాణాలోనే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇక ఏపీలో పార్టీ ఏమిచేయబోతోంది అన్నది కీలకంగా మారింది.

విచిత్రం ఏమిటంటే బీఆర్ఎస్ ఓడిపోవటమే కాకుండా బీజేపీ మద్దతుతో పోటీచేసిన జనసేన అభ్యర్ధులకు ఎనిమిది చోట్లా డిపాజిట్లు కూడా దక్కలేదు. జనసేన అయినా బీఆర్ఎస్ అయినా ఏపీలో ప్రధానంగా ఆధారపడింది కాపుల ఓట్లపైన మాత్రమే. ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మీద పవన్ దృష్టిపెట్టినట్లే బీఆర్ఎస్ కూడా పై ప్రాంతాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. పార్టీ పెట్టి పదేళ్ళు పాలించిన తెలంగాణాలోనే జనాలు ఓడించిన తర్వాత ఇక ఏపీ జనాలు మాత్రం బీఆర్ఎస్ ను ఎంతవరకు పట్టించుకుంటారా ? అన్నదే అసలు పాయింట్.