Begin typing your search above and press return to search.

ఏపీ తర్వాత మరో రాష్ట్రంలో బీఆరెస్స్ షట్టర్ క్లోజ్!

ఇందులో భాగంగానే పార్టీ పేరులో "తెలంగాణ" అనే సెంటిమెంట్ ను సైతం పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:23 AM GMT
ఏపీ తర్వాత మరో రాష్ట్రంలో బీఆరెస్స్  షట్టర్  క్లోజ్!
X

వరుసగా రెండు సార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నట్లు కనిపించడంతో.. ఇక తెలంగాణలో తమకు తిరుగుతులేదని భావించారో.. లేక, ఈ ఉత్సాహం జాతీయ స్థాయిలో కూడా కంటిన్యూ చేయాలని తలంచారో తెలియదు కానీ... బీఆరెస్స్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు.

ఇందులో భాగంగానే పార్టీ పేరులో "తెలంగాణ" అనే సెంటిమెంట్ ను సైతం పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అటు ఏపీలోనూ, ఇటు మహారాష్ట్రలోనూ బీఆరెస్స్ పార్టీ ఆఫీసులు ఓపెన్ చేశారు. ఈ రెండు చోట్లా సత్తా చాటితే జాతీయస్థాయిలో కూడా చక్రాలు తిప్పొచ్చని భావించారు.

ఇదే ఉత్సాహంలో కర్ణాటక ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే కథనాలొచ్చినా చివరి నిమిషంలో విత్ డ్రా అయ్యారు! అయితే... మిగిలిన రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే... టీఆరెస్స్ కాస్తా బీఆరెస్స్ అయినప్పటి నుంచీ కేసీఆర్ పై తెలంగాణలో ఆ సెంటిమెంట్ ప్రజల్లో తగ్గిందన్నే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించాయి. 2023 ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒకటి అని అంటుంటారు.

ఆ సంగతి అలా ఉంటే... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పక్క రాష్ట్రాల్లోని పార్టీ ఆఫీసులకు తాళాలు పడుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇప్పటికే బీఆరెస్స్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిష్క్రమణతో ఆంధ్రప్రదేశ్‌ లో ఆ పార్టీ తన షట్టర్లను మూసివేసింది. ఇదే సమయంలో తాజాగా మహారాష్ట్రలో దుకాణం మూసేసింది!

అవును... 2023 ఎన్నికల్లో ఓడిపోవడం, 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండటంతో మహారాష్ట్రలోని బీఆరెస్స్ నేతలు, కార్యకర్తలు ఎవరి దారి వారు చూసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ఓటమి, తదనంతరం జరుగుతున్న పరిణామాలతో వారంతా బీజేపీ, కాంగ్రెస్, శివసేనల్లో చేరిపోయారని తెలుస్తుంది.

కాగా... ఇటీవల కాలంలో బీఆరెస్స్ పార్టీ పేరును తిరిగి టీఆరెస్స్ గా మార్చే అవకాశాలున్నాయని.. ఆ దిశగా పరిశీలిస్తున్నారని అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఊహాగాణాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే!