సెగ్మెంట్ పాలిటిక్స్: అక్కడ పోరు ఏకపక్షమే.. కానీ, అసలు పోరు బీఆర్ ఎస్‌లోనే!
ప్రస్తుతం ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండ రాజ్యయ్యను కేసీఆర్ పక్కన పెట్టారు.
By: Tupaki Desk | 29 Oct 2023 8:30 AM ISTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల రాజకీయాలను పరిశీలిస్తే.. కొన్ని చోట్ల త్రిముఖ పోరు కనిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల ద్విముఖ పోరు కనిపిస్తోంది. అధికార పార్టీ బీఆర్ ఎస్-ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య ఎక్కువ నియోజకవర్గాల్లో హోరా హోరీ పోరు కనిపిస్తోంది.అయితే మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య త్రిముఖ పోరు కూడా నెలకొంది. ఇదెలా ఉన్నా.. కొన్ని కొన్నినియోజకవర్గాల్లో పోరు ఏకపక్షంగా మారింది. ఇలాంటి వాటిలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కీలకంగా మారింది.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. బీఆర్ ఎస్ తరఫున.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి టికెట్ దక్కింది. ఇక, కాంగ్రెస్ తరఫున సింగాపురం ఇందిర టికెట్ దక్కించుకోగా, బీజేపీ తరఫున గుండే విజయరామారావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా రాజకీయంగా దూకుడు పెంచారు. అయినప్పటికీ.. కడియం దూకుడు ముందు మిగిలిన ఇద్దరూ నిలబడి సత్తా చాటే పరిస్థితి లేదు. గత 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇందిర కేవలం 62 వేల ఓట్లు మాత్రమే సాధించారు. తర్వాత ఆమె నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.
దీంతో ఇందిరపై సానుకూల పవనాలు లేకుండా పోయాయి. మరోవైపు బీజేపీ తరఫున టికెట్ దక్కించుకున్న విజయరామారావు కూడా పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. సో.. మొత్తంగా చూస్తే..కడియం ఏకపక్ష పోరుతోనే ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంది.
అయితే.. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. అసలు పోరంతా కడియంకు సొంత పార్టీ నుంచే ఎదురు కానుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాడికొండ రాజ్యయ్యను కేసీఆర్ పక్కన పెట్టారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే.. పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ హామీకి రాజయ్య పైకి పరవశించినా.. అంతర్గతంగా కడియంతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయన మనసు నొచ్చుకుంటూనే ఉంది.అంటే.. నోటితో మాట్లాడుతూనే నొసటితో వెక్కిరింపు రాజకీయాలు చేస్తున్నారన్నమాట. దీంతో కడియం గెలుపు ఇప్పుడు రాజయ్య చేతుల్లో ఉందనే టాక్ ఉంది. కొన్నాళ్లుగా ఇక్కడ కడియం వర్సెస్ రాజయ్యల మధ్య మాటల తూటాలు పేలాయి. రాజకీయాలు వేడెక్కాయి.
ఇప్పుడు ఏకంగా కడియంకు.. టికెట్ ఇవ్వడాన్ని రాజయ్య జీర్ణించుకునే పరిస్థితి లేదు. పైకి ఎంత అనునయంగా ఉన్నా.. అంతర్గతంగా ఆయన కడియంకు చెక్ పెట్టేలా రాజకీయాలు చేయడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. దీంతో పోరుఏకపక్షమే అయినా.. సొంత పార్టీ నుంచే కడియంకు అసలు పోరు ఎదురు కానుందని అంటున్నారు పరిశీలకులు.
