Begin typing your search above and press return to search.

ఈ తొందరేంటి? ఈ హడావుడేంటి? గులాబీ జట్టు స్వేదపత్రమా?

చేతిలో ఉన్న అధికారం చేజారి గట్టిగా 2 వారాలు కానప్పటికి.. తామే పవర్ లో ఉన్నట్లుగా వ్యవహరించేలా చేస్తోంది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 3:45 AM GMT
ఈ తొందరేంటి? ఈ హడావుడేంటి? గులాబీ జట్టు స్వేదపత్రమా?
X

టైం మనది కానప్పుడు కాస్తంత వెయిట్ చేయాలి. ఇందుకు కాస్త సహనం.. మరికాస్తా ఓపిక చాలా అవసరం. అందుకు భిన్నంగా హడావుడికి తొందరపాటును జత చేస్తే ఒప్పుల కంటే తప్పులే ఎక్కువగా జరుగుతాయి. దీంతో అనవసర తలనొప్పులే మిగులుతాయి. పదేళ్లు నాన్ స్టాప్ గా (వాస్తవంగా అయితే తొమ్మిదినరేళ్లేననుకోండి) అధికారంలో ఉండి.. మరో పదేళ్లు తమకు ఎదురే లేదనుకున్న అతి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్లిన గులాబీ దళానికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగేలా షాకిచ్చింది. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ కు చేరిందన్న నిఘా నివేదికల్ని సైతం నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్లటాన్ని మర్చిపోలేదు.

ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సైతం తమకున్న మేజిక్ తో అధిగమిస్తామన్న నమ్మకం మొండుగా ఉండేది. అదే గులాబీ కారు కాస్తా ఓటమి అనే గొయ్యిలో పడి.. బయటకు రాలేని పరిస్థితి. ఇలాంటప్పుడు ఓర్పుతో వ్యవహరించి.. బయటకు రావాల్సి ఉంది. అయితే.. ఎన్నికల ముందు నుంచి తమను విడవకుండా ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఓటమి తర్వాత కూడా విడవని వైనం గులాబీ దళాన్ని తప్పుల మీద తప్పులు చేసేలా చేస్తోంది.

చేతిలో ఉన్న అధికారం చేజారి గట్టిగా 2 వారాలు కానప్పటికి.. తామే పవర్ లో ఉన్నట్లుగా వ్యవహరించేలా చేస్తోంది. తమ చేతిలో అధికారం లేదన్న భావనే వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్న విషయంవారి చేష్టల్ని చూస్తే అర్థమవుతోంది. అందుకేనేమో.. మరో మూడు నెలల్లో అధికారం తమదే అన్న అతిశయం వారి చేత ఇప్పటికే పలు తప్పుల్ని చేయించింది. మొదట్లో ఉన్న మూడు నెలలు ఇప్పుడు ఆర్నెల్లకు పెరిగిన వైనాన్ని మర్చిపోతున్నారు. పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ పోతున్నారు.

అధికారమన్న మత్తులోకి దిగబడిపోయిన వేళ.. అందులోని నుంచి వాస్తవాన్ని చూడలేక.. బయటకు రాలేకపోతున్న ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వేళలో విచక్షణ మిస్ అయ్యి.. అర్థం లేని ఆవేశానికి లోనవుతున్నారు. ఈతీరుతో మరిన్ని అనర్థాలు ఖాయమన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తే ఇదే విషయంఅర్థమవుతుంది. బాత్రూంలో జారి పడి.. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన గులాబీ బాస్..ఆయనకు బదులుగా గులాబీ కారును బావ బామ్మర్దులు జోడ్డెద్దుల మాదిరి నడిపిస్తున్న వేళ.. ఇద్దరికి ఇద్దరు ప్రతి చిన్న విషయంలోనూ అవసరానికి మించిన అతిశయాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థి చేతికి తమపై అధిక్యతను ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తున్నారు.

అధికారం తీసేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజల తీర్పును తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయినదానికి కాని దానికి రేవంత్ సర్కారు మీద విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా రెండు వారాలు కాక ముందే.. రేవంత్ సర్కారు చేసే వ్యాఖ్యలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్లు ఇవ్వటం తెలిసిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం విడుదల చేస్తున్న వైట్ పేపర్లు (శ్వేతపత్రాలు).. అందులోని అంశాలు గులాబీ ప్రభుత్వ గొప్పను.. వారెంత మేలు చేశారన్న దానిపై వ్యంగ్య వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో తరచూ దొరికిపోతున్న అధికారపక్షాన్ని పద్దతిగా మాటలు అంటూ.. తొందరపాటును ప్రదర్శించని రేవంత్ నాయకత్వ తీరు రోటీన్ కు భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది.

మరోవైపు..దీనికి భిన్నంగా గులాబీ బావ బామ్మర్దుల తీరు ఉండటం గమనార్హం. కొత్త ప్రభుత్వం కొలువు తీరి నెల కూడా కాకముందే.. విమర్శలతో ఉతికి ఆరేయాలన్నట్లుగా వ్యవమరిస్తున్న కేటీఆర్.. హరీశ్ ల తీరు విస్మయానికి గురయ్యేలా చేస్తోంది. ఏం చేసినా.. రేవంత్ చేతిలో ఉన్న అధికారం చేజారటం అంత తేలికైన విషయం కాదు. అలాంటివేళ.. తొందరపాటుతనంలో తప్పులు చేసే కన్నా.. ఆచితూచి అడుగులు వేయాల్సిన విషయాన్ని వారిద్దరు ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్నగా మారింది.

పగలు రాత్రి అన్న తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లినట్లుగా ప్రసంగాలు ఇచ్చే కేటీఆర్.. హరీశ్ రావుల వ్యాఖ్యలు రివర్పులో ఎదురుదెబ్బలు తినేలా చేస్తున్నాయన్న విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని చూస్తున్న వారికి అర్థమవుతోంది. కానీ.. ఆ విషయాన్ని గులాబీ దళం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. తమను ఎదుర్కొనే విషయంలో రేవంత్ సర్కారు వ్యూహం ఏమిటన్న విషయంపై క్లారిటీ రాకముందే హడావుడి చేస్తున్నారు కేటీఆర్.. హరీశ్ లు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి పోటీగా గులాబీ పార్టీ తరఫున ‘స్వేదపత్రం’ పేరుతో విడుదల చేయనున్నట్లుగా పేర్కొన్న వైనం ఇప్పుడు తొందరపాటు చర్యగా అభివర్ణిస్తున్నారు.

ఎందుకుంటే.. గణాంకాల్ని తమకు అనువుగా ఎలా చూపించినా.. అందులోని నిజం తమను చిరాకు పెడుతుందన్న లాజిక్ మిస్ కావటమే కారణం. ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని తప్పులు జరుగుతాయి. వాటిని కవర్ చేసేస్తూ మాటలు చెప్పే క్రమంలో అడ్డంగా దొరికిపోతుంటాం. ఇప్పుడు కేటీఆర్.. హరీశ్ రావుల తీరుతో మరిన్ని తప్పులు తెర మీదకు వస్తున్నాయి. ఉచ్చు విసిరినట్లుగా వ్యవహరిస్తున్న రేవంత్ వ్యూహాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమవుతూ.. అధికార పార్టీ చేతికి అవసరానికి మించిన అస్త్రాల్ని ఇవ్వటం కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. రేవంత్ సర్కారును అర్జెంట్ గా బద్నాం చేయాలన్న హడావుడి.. తొందరపాటే అవుతుందన్న విషయాన్ని బావబామ్మర్ధులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. అనవసరంగా దొరికిపోవటం గులాబీ దళానికి ఉన్న మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కాల వ్యవధి పెద్దగా లేకున్నా రేవంత్ రెడ్డి సర్కారుపై ఫెయిల్యూర్ ముద్ర వేసే విషయంలో అనుసరిస్తున్న వ్యూహం తొందరపాటే అవుతుందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఎంత త్వరగా గమనిస్తే.. గులాబీ దళం అంత తక్కువ పనులు చేస్తుందన్నది వాస్తవం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవాన్ని గుర్తించాలన్న సోయి లేకపోవటమే గులాబీ దళానికి ఉన్న అసలు సమస్య.