Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీకి మరో అరెస్టు టెన్షన్!

మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో గులాబీ బాస్ కుమార్తె కవిత అరెస్టు అయి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 March 2024 5:58 AM GMT
గులాబీ పార్టీకి మరో అరెస్టు టెన్షన్!
X

చేతిలో అధికారం.. తిరుగులేని అధిక్యత ఉన్న రోజులు గులాబీ పార్టీకి అయిపోయినట్లేనా? మళ్లీ అలాంటి రోజులు ఎప్పటికి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అధికార పక్షం నుంచి విపక్షంగా మారినప్పటి నుంచి .. వైఫ్యలాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీనికి వరుస పెట్టి చేస్తున్న తప్పులు ఒక ఎత్తు అయితే.. గతంలో చేసిన తప్పులు వడ్డీతో సహా మారి వెంట పడుతున్న దుస్థితి. ఇలాంటివేళ.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందోఅర్థం కాని దుస్థితి నెలకొంది.

మొన్నటికి మొన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో గులాబీ బాస్ కుమార్తె కవిత అరెస్టు అయి ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావటం తెలిసిందే. ఇటీవల కాలంలో కవిత పెట్టుకుంటున్న పిటీషన్లు ఒక్కొక్కటి వీగిపోతున్నాయి. తాజా పరిణామాల్ని చూస్తే.. కవిత మరికొంత కాలం ఈడీ పర్యవేక్షణలోనూ.. ఆ తర్వాత జైలు జీవితానికి సిద్ధం కావాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే మరోవైపు తెలంగాణలో మరో అంశం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం అంతకంతకూ పెద్దదిగా మారుతోంది. ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులు ఈ అంశంలో అరెస్టు కావటం.. మరికొందరు అరెస్టు అవుతామన్న భయంతో ముందస్తు జాగ్రత్తగా విదేశాలకు చెక్కేయటం హాట్ టాపిక్ గా మారింది. వారిని గుర్తించేందుకు వీలుగా నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో సంచలన అంశం తెర మీదకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకాలం దీనిపై చర్చ జరిగినా దానికి సంబంధించిన అంశాలుబయటకు రాని పరిస్థితి. ఎప్పుడైతే అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్న భుజంగరావు.. తిరపతన్నలు అరెస్టు అయ్యారో.. దీనికి సంబంధించిన సమాచారం వెల్లడైనట్లుగా చెబుతున్నారు. గులాబీ పార్టీలోకీలక నేత గా వ్యవహరించి.. అధినేతకు అన్నీతానై అన్నట్లుగా వ్యవహరించిన పార్టీ ముఖ్యుడు ఒకరు అరెస్టు కావటం ఖాయమంటున్నారు.

నిజానికి ఆదివారం అర్థరాత్రి వేళలో సదరు గులాబీ కీలక నేత అరెస్టు అయ్యే అవకాశం ఉందన్న చర్చ మీడియా సర్కిల్స్ లోనూ..రాజకీయ వర్గాల్లోనూ సాగింది. దీంతో.. ఏ నిమిషాన అరెస్టు ప్రకటన వస్తుందన్న అంశంపై రాత్రి రెండు గంటల వరకు మీడియాకు చెందిన పలువురు వెయిట్ చేయటం గమనార్హం. ఈ అంశంపై వినిపిస్తున్న తాజా వాదన ఏమంటే.. ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైనదని.. దీనిపై రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా ఉందని.. ట్యాపింగ్ లెక్క తేల్చాలని.. అందుకు కారణమైన వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వదిలి పెట్టకూడదన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. తదుపరి అరెస్టు ఎవరిది? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.