రేవంత్ ని గుచ్చుతున్న గులాబీ ముళ్ళు
ఇవన్నీ చూస్తూంటే రేవంత్ రెడ్డి మీద బీయారెస్ అగ్ర నాయకత్వ త్రయం ఒక ప్రణాళిక ప్రకారం టార్గెట్ చేస్తూ వస్తోందని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Oct 2023 8:45 AM ISTరాజకీయాల్లో ఎన్నో వ్యూహాలు ఉంటాయి. అవి సరిగ్గా వర్కౌట్ అయితే ప్రత్యర్ధి చిత్తు అవుతారు. తెలంగాణా ఎన్నికల సందర్భంగా అలాంటి రాజకీయాలనే రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయి. రెండు సార్లు అధికారంలో ఉన్న బీయారెస్ మూడవసారి గెలవాలని చూస్తోంది. అందుకోసం కాంగ్రెస్ బలహీనతల మీద బలం మీద బలగాల మీద గురి పెట్టింది.
ఈ విధంగా మూడంచెల వ్యూహంతో బీయారెస్ అడుగులు వేస్తోంది. ముందుగా తీసుకుంటే బీయారెస్ తన అభ్యర్ధులను అందరినీ ఎంపిక చేసుకుని ప్రచార ఘట్టంలో దూసుకుని పోతోంది. ఇది ఒక విధంగా బీయారెస్ కి అడ్వాంటేజ్ గానే ఉంది. బీయారెస్ నాయకత్వం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఒక్క మాట మీద నడచే పార్టీ అది.
కాంగ్రెస్ ఆ విధంగా కాదు, జాతీయ పార్టీ. ఢిల్లీలో నాయకులు ఉంటారు. ఒక డెసిషన్ తీసుకోవాలంటే చాలా రకాలుగా కసరత్తు చేస్తారు. అనేక అంచెలు దాటాలి. దాంతో లేట్ అన్నది కామన్. ఇక ఒక డెసిషన్ తీసుకున్నా కట్టుబడడం అన్నది కూడా కాంగ్రెస్ లాంటి పార్టీలో కష్టం. అందువల్ల ఆ పార్టీలో ప్రధాన బలహీనత అది.
అలాంటి బలహీనతల మీద బీయారెస్ ఫోకస్ పెట్టేసింది. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వంటి వారినే తమ వైపునకు తిప్పుకుంది. ఇపుడు మరింతమంది అలాంటి వారి మీద కన్నేస్తోంది. ఇక కాంగ్రెస్ లో లుకలుకలు అసంతృప్తులు పెద్ద ఎత్తున ఉంటే వాటిని ఎలా సొమ్ము చేసుకోవాలో కూడా బీయారెస్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనే అనుకోవాలి.
ఇక కాంగ్రెస్ లో బలాలూ ఉన్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి బలం, మంచి మాటకారి. వ్యూహరచనా చాతుర్యం ఉన్న వారు. జనాలను కట్టిపడేసే విధంగా స్పీచ్ ఇచ్చే నైపుణ్యం ఆయనకు ఉంది. అందువల్లనే ఈ రోజున కాంగ్రెస్ అన్ని ఆటంకాలు తట్టుకుని ఈ రోజున ఈ పొజిషన్ కి వచ్చింది. దాంతో రేవంత్ రెండ్డి మీద గులాబీ పార్టీ గురి పెట్టేసింది. తన గులాబీ ముళ్ళను తెచ్చి రేవంత్ ని గుచ్చేస్తోంది.
బీయారెస్ వ్యూహం ప్రకారం రేవంత్ రెండ్డిని గట్టిగా టార్గెట్ చేయాలి. అదే టైం లో ఆయన మీద కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు వ్యతిరేకత ఉన్న దాన్ని ఇంకా బాగా పెంచాలి. అలాగే జనంలో ఇమేజ్ ని పలుచన చేయాలి. ఈ రకంగా రేవంత్ మీద బీయారెస్ ఒక ప్లాన్ ప్రకారం దాడి మొదలెట్టేసింది అని అంటున్నారు. ఎపుడో జరిగిపోయిన ఓటుకు నోటుకు కేసుని పదే పదే ముందుకు తేవడం ద్వారా రేవంత్ రెడ్డి రాజకీయ అవినీతిని బయటేయాలన్నదే గులాబీ పార్టీ వ్యూహం అని అంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డిని ఫిరాయింపు దారుడిగా చిత్రీకరిస్తున్నారు. ఆయనకు కుర్చీల మీదనే మోజు ఉంది, పార్టీలు ముఖ్యం కాదని ఆయన క్రెడిబిలిటీనే దెబ్బ తీసే విధంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా చూస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పార్టీల విధేయత కాదు కావాల్సింది అంటూ కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆనాడు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని నోటికి వచ్చినట్లు తిట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమెనే దేవత అంటున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు, నోటుకు సీటు అనే వాళ్లు అంటూ రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఎక్కు పెట్టారు.
తెలంగాణా ఉద్యమ కాలంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. హరీష్ రావు మాత్రమే కాదు కేసీయారి కూడా ఈ మధ్యన సిరిసిల్లా సభలో పీసీసీ చీఫ్ కి రైతులకు ఉచిత విద్యుత్ మూడు గంటలు మాత్రం చాలుట అని రైతు వ్యతిరేకి ఆయన అని మాట్లాడారు. ధరణి ని రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా కేటీయార్ కూడా రేవంత్ రెడ్డి మీద మాటల తూటాలనే పేలుస్తున్నారు.
ఇవన్నీ చూస్తూంటే రేవంత్ రెడ్డి మీద బీయారెస్ అగ్ర నాయకత్వ త్రయం ఒక ప్రణాళిక ప్రకారం టార్గెట్ చేస్తూ వస్తోందని అంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ముందు వరసలో సీఎం రేసులోకి వచ్చే రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడించాలని పద్మవ్యూహాన్ని రచిస్తున్నారు. ఇవన్నీ చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి బీయారెస్ రాజకీయ వ్యూహాన్ని ఎలా చేదిస్తారు అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.
