Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు ఊరటే.. కానీ చపాతీ కర్రతో టెన్షన్

తెలంగాణలో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. విజయం దిశగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఆ పార్టీ సాగుతోంది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 9:35 AM GMT
బీఆర్ఎస్ కు ఊరటే.. కానీ చపాతీ కర్రతో టెన్షన్
X

తెలంగాణలో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. విజయం దిశగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఆ పార్టీ సాగుతోంది. తమకు పోటీ కాంగ్రెస్ తోనే అని భావిస్తున్న బీఆర్ఎస్.. ఆ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో తమకు నష్టం చేకూర్చే విషయాలపైనా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇందులో తమ కారు గుర్తును పోలిన గుర్తులు నష్టం చేస్తాయని భావించిన బీఆర్ఎస్.. ఆయా గుర్తులను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. తాజాగా బీఆర్ఎస్ కు ఊరట కలిగేలా ఈసీ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మినహాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు 193 గుర్తులతో ఈసీ జాబితా రూపొందించింది. కానీ ఏపీ, తెలంగాణ ఎన్నికల నుంచి ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మినహాయించింది.

ఈసీ తాజా నిర్ణయం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు కలిసొచ్చేదే. కంటి చూపు సరిగ్గా లేని వాళ్లు, వయసు మీద పడ్డవాళ్లు కారు గుర్తుకు ఓటేసే బదులు దీన్ని పోలిన వాటికి ఓట్లు వేస్తున్నారని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు, చపాతీ కర్ర లాంటి గుర్తులతో నష్టం కలుగుతోందని ఈసీకి బీఆర్ఎస్ విన్నవించింది. ఇందులో ఆటో రిక్షా, హ్యాట్, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మినహాయించిన ఈసీ చపాతీ కర్ర గుర్తును మాత్రం అలాగే ఉంచింది. ఇప్పుడీ చపాతీ కర్ర గుర్తు బీఆర్ఎస్ కు టెన్షన్ కలిగించేదనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.